- నాకు రాజకీయాలు తెలియవు, ఆసక్తీ లేదు
- త్వరలోనే మోడల్ నియోజకవర్గంగా కుప్పం
- వీర్నమల గ్రామ మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి
రామకుప్పం, వీర్నమల(చైతన్యరథం): రాజకీయాలు తెలియని తాను చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సమయంలో పార్టీ కార్యకర్తల కోసం నిజం గెలవాలి యాత్రతో ప్రజల్లోకి వచ్చానని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్న భువనేశ్వరి గురువారం రామకుప్పం మండలం వీర్నమల గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు, వీర్నమల గ్రామ ప్రజలకు, నారీ శక్తికి నమస్కారాలు చెబుతూ ప్రసంగం ప్రారంభించారు. నేడు ఇలా మీ ముందు ఉన్నానంటే దానికి కారణం చంద్రబాబుపై మీరు పెట్టుకున్న నమ్మకమేనన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబుపై, మా కుటుంబంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు మా వంతు కృషి చేస్తున్నాము. నాకు రాజకీయాలు తెలియదు…వాటి పట్ల ఎలాంటి ఆసక్తి కూడా లేదు. చంద్రబాబును 53రోజులు జైల్లో నిర్బంధించినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం, కార్యకర్తల కోసం నేను నిజం గెలవాలి కార్యక్రమంతో బయటకు వచ్చాను.
ఆ సమయంలో మీరు నాపై చూపిన ప్రేమ, ఆదరణ, మీరు ఇచ్చిన ధైర్యాన్ని నేను మరచిపోలేను. నా భర్త జైల్లో ఉన్నారనే బాధను దిగమింగుతూనే కార్యకర్తల కుటుంబాలను ఆదరించి, వారికి అండగా నిలబడ్డాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మహిళలు నాకు ధైర్యం ఇచ్చారు, నా వెన్నంటి నడిచి నాకు అండగా నిలిచారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనో వేదనతో వందలాది మంది కార్యకర్తలు చనిపోయారు. వైసీపీ పాలనలో కార్యకర్తలు పడుతున్న హింసలు, ఇబ్బందులు చూసి దేవుడు ఏంటి ఇలా వదిలేశాడు అని అనుకునేదాన్ని. కానీ దేవుడే మీ కళ్లు తెరిపించి రాక్షస పాలనను అర్థమయ్యేలా చేశాడు. మీరంతా ఓటు అనే ఆయుధంతో దుర్మార్గపు పాలనను అంతం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 83శాతం ఓట్లు పోలయ్యాయి…ఇది దేశ చరిత్రలో ఓ రికార్డు. వైసీపీ పాలనలో ప్రజలు విసిగెత్తిపోయి, అసహనంతో ఉన్నారని చెప్పడానికి ఓటింగ్ శాతమే నిదర్శనం. ప్రజల కోసం ఏమి చేయాలా అని చంద్రబాబు రాత్రింబవళ్లు ఆలోచిస్తూ ఉంటారు.
కుటుంబం గురించి ఎప్పుడూ చంద్రబాబు ఇలా ఆలోచించరు. చంద్రబాబును మేం ప్రజలకు అంకితం చేశాం…ఆయన మీ ఆస్తి. కుప్పం నియోజకవర్గం అతి త్వరలోనే మోడల్ నియోజకవర్గంగా మారబోతుంది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలు, కంపెనీలు వైసీపీ పాలనలో రాష్ట్రం వదిలి పారిపోయాయి. ఆ కంపెనీలతో నేడు చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. వారిని మళ్లీ రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మా కుటుంబం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీ ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని భువనేశ్వరి హామీ ఇచ్చారు.
భువనమ్మకు ధన్యవాదాలు: ఎమ్మెల్సీ శ్రీకాంత్
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన వీర్నమల మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెద్దసంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఎన్నికలకు ముందు కుప్పం నియోజకవర్గంలో భువనమ్మ ప్రచారం చేశారు. భువనమ్మ ప్రచారం చేసిన ప్రతి గ్రామంలోని బూత్ లో మంచి మెజార్టీ వచ్చింది. చంద్రబాబుతో పాటు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తానంటూ భువనమ్మ మన మధ్యకు వచ్చారు. గత మూడు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో అలుపెరుగని ప్రయాణం చేస్తున్నారు, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. కుప్పం ప్రజలపై తన బిడ్డపై కురిపిస్తున్న ప్రేమను కురిపిస్తున్నారు. సమస్యల్ని అడిగి తెలుసుకుని పరిష్కారించేందుకు నడుం కట్టారు. భువనమ్మకు కుప్పం ప్రజల తరపున ఎమ్మెల్సీ శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు.