- జగన్ పార్టీ విమర్శలకు దీటుగా బదులివ్వాలి
- భారీ పెట్టుబడులతో అభివృద్ధి పరుగులు
- బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ (చైతన్యరథం): ఏపీలో సీఎం చంద్రబాబు పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు పాలన భేష్ అంటూ కితాబిచ్చారు. రాష్ట్రంలో పరిపాలనపై కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని చెప్పారు. గురువారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, అండమాన్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో సుమారు అరగంటపాటు ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలో చంద్రబాబు పాలన చాలా బావుందని ప్రశంసించారు. పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని, ఇది అభివృద్ధికి మంచి సూచిక అని ప్రధాని అన్నారు. ఇది శుభపరిణామమన్నారు.రాబోయే రోజుల్లో ఏపీ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి చక్కటి సమన్వయంతో ముందుకు సాగడం మంచి పరిణామమన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా దీటుగా కౌంటర్ ఇవ్వాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.
ఏపీలో పాలనను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ పరిణామాలపై తెలుగు ఎంపీలు మరింత చురుగ్గా ఉండాలని, పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.
















