- రెండేళ్ల కాలపరిమితితో మద్యం పాలసీ
- అక్టోబరు తొలివారంనుంచీ అమలు
- గీత కులాలకు పదిశాతం దుకాణాలు
- భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు
- ఎంఎస్‌ఎంఈల వృద్ధికి రూ.100కోట్ల నిధి
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
- కీలక నిర్ణయాలను ఆమోదించిన కేబినెట్
- వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథి
అమరావతి (చైతన్య రథం): నూతన మద్యం పాలసీని రాష్ట్ర కేబినెట్ ఆమొదించింది. అక్టోబరు మొదటి వారంనుండి నూతవ పాలసీ అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మద్యం ధరలు, రిటైల్ వ్యాపారం, పన్నులపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులను మంత్రి మండలి ఆమోదించింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని, సగటు మద్యం ధర రూ.99నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన భేటీలో ఐఎంఎఫ్‌ఎల్, ఎఫ్‌ఎల్ వాణిజ్య నియంత్రణ చట్టం -1993కు తగిన సవరణలు చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ రెండో ఈ-కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
‘నూతన మద్యం పాలసీలో నిర్వహణ, ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలసీకి రెండేళ్ల కాలపరిమితి నిర్ణయించడంతో రిటైలర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తారు. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారతకు పెద్దపీటవేస్తూ ప్రస్తుతమున్న దుకాణాల్లో 10 శాతం గీత కులాలకు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10శాతం అంటే.. 340 దుకాణాలు కేటాయిస్తారు. రిజర్వుడ్ షాపులకు ప్రత్యేక మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అన్‌రిజర్వ్‌డ్ షాపులకు ప్రతిపాదిత శ్లాబుల్లో 50శాతం లైసెన్స్ ఫీజు కట్టాలి. ఇది కల్లుగీత వర్గాలకు సామాజిక న్యాయం, ఆర్థికాభ్యున్నతికి తోడ్పడుతుంది. రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ విధానాన్నే అనుసరిస్తారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు’ అని పార్థసారథి వెల్లడిరచారు.
సాధారణ పరిపాలనా విభాగంలో..
ముఖ్యమంత్రి సహాయనిధి కేసులు, సీఎం ఫిర్యాదులు తదితర అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పటిష్ఠం చేసేందుకు 2024 జూన్ 12నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధ కేటగిరీల్లో 58 పోస్టులను తాత్కాలికంగా సృష్టించేందుకు ఆగస్టు 25న జారీ చేసిన జీవో 78, జీఏ (పోల్.ఏ) ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందుబాటులోవున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉత్తమ అభ్యాసనలను అందిపుచ్చుకుని వ్యవస్థ పటిష్టంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి మండలికి ముఖ్యమంత్రి సూచించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి పేరు
విజయనగరం జిల్లాలో నిర్మాణంలోవున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరు మార్చాలని, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కేబినెట్ ఆమోదించింది.
ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకానికి రూ.100కోట్ల నిధి
ఆగస్టు 8, 2024న జరిగిన రాష్ట్రస్థాయి కేటాయింపు కమిటీ (ఎస్‌ఎల్‌ఎసి) సమావేశం సిఫార్సుల ఆధారంగా ఏపీఐఐసీ నిబంధనల మేరకు (ప్రతి కేసు పరిధి, 50 ఎకరాలకంటే తక్కువ) సిఫార్సు చేసిన 203 పారిశ్రామిక భూకేటాయింపులను కేబినెట్ ఆమోదించింది. ప్రతి ఇంటినుంచీ ఒక ఎంఎస్‌ఎంఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని, దిశగా పారిశ్రామిక, వాణిజ్య శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం కింద అందే లబ్ధిని రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు అందజేసి అభివృద్ది పథంలో నడపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లతో ప్రాథమిక కార్పస్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. కొలేటరల్ గ్యారెంటీ లేకుండా ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ.5 వేల కోట్ల ఋణ సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీం ద్వారా సుమారు 35,000 కొత్త గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగనుంది. దీనివల్ల వ్యవస్థాపకత, సృజనాత్మకతను ప్రోత్సహించినట్టవుతుందని ప్రభుత్వం భావిసోంది. మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సీజీటీఎంఎస్‌ఈ) భాగస్వామ్యంతో ఇప్పటికే అందిస్తున్న 75-85 శాతం గ్యారంటీకి అదనంగా 10 నుంచి 20 శాతం రుణాలకు అదనపు గ్యారంటీ లభిస్తుంది. ఇది ఎంఎస్‌ఈలకు ఇచ్చిన రుణ మొత్తంలో 95శాతం.. అంటే గరిష్టంగా రూ.5 కోట్ల వరకు రుణం తీసుకునే ఎంఎస్‌ఈలకు ఎటువంటి అదనపు ఖర్చు లేని సౌలభ్యాన్ని కలిగిస్తారు.
కడప జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ (టీసీ) కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు సీఆర్‌డీఏ ద్వారా రాజధాని ప్రాంతంలో 20 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఓకే చెప్పింది.
ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం..
రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ) ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. కమ్యూనిటీస్థాయిలో సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహణకూ కేబినెట్ ఓకే చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్బంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
నవంబర్ 1న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్
విజన్ డాక్యుమెంట్ వికసిత్ ఆంధ్ర 2047 పేరును స్వర్ణాంధ్ర ఏ 2047గా మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 వరకు స్టేక్ హోల్డర్స్ సంప్రదింపుల అనంతరం 1 నవంబర్, 2024న విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.