అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని యజ్ఞంలా చేపట్టి 2027కి పూర్తిచేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మంగళవారం వాటర్ పాలసీని సమీక్షించిన సీఎం.. ఈమేరకు జలవనరుల విభాగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డిసెంబర్ రెండోవారంలో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం.. అదేరోజు పోలవరం వర్క్ టైమ్ షెడ్యూల్ విడుదల చేస్తారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత సమయం వృథా చేయకుండా కాలంతో పరిగెత్తాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన ఐదు నెలల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తిస్థాయి అవగాహనతో షెడ్యూల్ విడుదల చేయడానికి ఉపక్రమించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఒక్కొక్క సాంకేతిక సమస్యను అధిగమిస్తూ.. ప్రాజెక్టుల డిజైన్లకు సూత్రప్రాయంగా అనుమతులు సాధించారు. పోలవరం ఆర్ అండ్ ఆర్, భూసేకరణకు సంబంధించిన రూ.996 కోట్ల పెండిరగ్ నిధుల విడుదలకూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. పోలవరం విషయంలో చత్తీస్‌గడ్, ఒరిస్సా ప్రభుత్వాలతో చర్చించి అంతర్రాష్ట్ర సమస్యలకు చెక్ పెట్టాలని, పోలవరం ఫలాలు రాయలసీమ, ఉత్తరాంధ్రకు అందేలా చేయాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉంది.