- నవశకానికి నాంది పలికేలా భారీగా సభ
- రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు
- 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగరాసేలా ఏపీలో మళ్లీ ప్రభంజనం
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా
- 17వ తేదీ సభ ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో యువనేత సమావేశం
అమరావతి: నవశకానికి నాంది పలికేలా ఈనెల 17వ తేదీన చిలకలూరిపేటలో సభ జరగనుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాతియుగం నుండి రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపించేందుకే మూడు పార్టీల పొత్తు అని వివరించారు. 2014 ఎన్నికల ఫలితాన్ని తిరగ రాసేలా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మళ్లీ ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసం అయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేతులు కలిపిన మూడు పార్టీల పొత్తును ప్రజలు ఆహ్వానిస్తున్నా రన్నారు. చిలకలూరిపేట సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నేతలతో 13 ముఖ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల సభ్యులతో మంగళవారం లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ, జనసేన ముఖ్యనేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… బుధవారం ఉదయం 9.30 గంటలకు బొప్పూడిలో భూమి పూజ జరుగుతుందన్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరిన తర్వాత జరుగుతున్న తొలి సభ ఇది అని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేద్దామన్నారు. సభకు లక్షలాది మంది తరలివస్తారని, చరిత్రలో నిలిచేలా సభను నిర్వహిద్దామన్నారు. కమిటీల ప్రకారం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించి సభ విజయానికి కృషి చేయాలన్నారు. మూడు పార్టీల పొత్తు, అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేయబోతున్నామనేదానిపై సభా వేదిక ద్వారా పార్టీ అగ్రనేతలు ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నేతలు, కమిటీల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మోదీ రాక ఖరారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జన సేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం
పంపింది. ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రానున్నారు. పొత్తు తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో మూడు పార్టీలూ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నాయి. పెద్ద పార్టీగా తెదేపా ఎక్కువ బాధ్యత తీసుకుని, పెద్దఎత్తున విజయవంతం చేసేందుకు కార్యాచరణను రూపొందించింది.