అమరావతి: ఎపి సిఐడి వైసిపి అనుబంధ విభాగంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ రెడ్డి మూర్కత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా సిఐడి అధికారులు పనిచెయ్యడం దారుణమని అన్నారు. టిడిపి కార్యకర్త వెంగళరావు చేసిన తప్పేంటి? అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఎవరి ఆదేశాల మేరకు సిఐడి అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు? జగన్ రెడ్డి ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ టిడిపిలో లేరు. అరెస్ట్ చేసి కొడితే ప్రశ్నించడం తగ్గుతుందని భ్రమపడకు జగన్ రెడ్డి. నువ్వు ఎంత తొక్కితే అంత లేస్తాం. అన్ని లెక్కలు తేలుస్తాం. వెంగళరావుని తక్షణమే విడుదల చెయ్యాలి. చట్టాలను అతిక్రమించి వ్యవహరించిన అధికారుల పై న్యాయ పోరాటం చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
వైసిపి డ్రెస్ వేసుకున్న ఖాకీలు
కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసిపి డ్రెస్ వేసుకున్నారని లోకేష్ దుయ్యబట్టారు. శాంతిభద్రతలు గాలికొదిలి టిడిపి నాయకుల ముందు మీసం మెలేయడం, కార్యకర్తల తలలు పగలకొట్టడం, సామాన్యులను చిత్రహింసలకు గురిచెయ్యడం పనిగా పెట్టుకున్నారు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో టిడిపి సర్పంచ్ భర్త రామాంజనేయులును యానిమేటర్‌గా రాజీనామా చెయ్యాలని వైసిపి నేతలు బెదిరించారు. అందుకు అంగీకరించకపోవడంతో రామాంజనేయులుతో సహా మరో ఆరుగురు గ్రామస్థుల పై అక్రమ కేసులు బనాయించారు.
స్వయంగా తాడిపత్రి డిఎస్పీ చైతన్య రంగంలోకి దిగి బోయ సామాజికవర్గానికి చెందిన నాగార్జున, సింహాద్రితో పాటు మరో నలుగురుపై థర్డ్ డిగ్రీ ప్రయో గించి చేతి వేళ్ళు విరిగి రక్తం కారే వరకూ హింసించారు. విచారణ పేరుతో గ్రామస్థులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. పరిధి దాటి వైసిపి నాయకుల్లా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరుతున్నాను. కోనుప్పలపాడు గ్రామస్థులకు టిడిపి అండగా ఉంటుంది. పోలీసుల పై ప్రైవేట్ కేసు వేస్తున్న గ్రామస్థులకు టిడిపి న్యాయ సహాయం అందిస్తుందని లోకేష్ తెలిపారు.