- సీఎంఆర్‌ఎఫ్‌తో పేదల ఆరోగ్యానికి భరోసా
- పలువురికి చెక్కులు పంపిణీ
ఒంగోలు (చైతన్యరథం): ఆపదలో ఉన్నవారికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. తన నియోజకవర్గం ప్రకాశం జిల్లా కొండెపిలో వివిధ సమస్యలతో బాధపడుతున్న 30 మందికి రూ.38,78,482 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్) చెక్కులను ఆదివారం తూర్పునాయుడుపాలెంలోని తన స్వగృహంలో మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనసున్న గొప్ప మానవతావాది అన్నారు. 2014 – 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేవిధంగా ఆపదలో ఉన్నవారికి సి.ఎం.ఆర్.ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి గతంలో మాదిరిగానే మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు. ఇలాంటి పేద కుటుంబాలన్నింటికీ పెద్ద మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పేదలందరికీ తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా కృషిచేసిన మంత్రికి, మంజూరు చేసిన ముఖ్యమంత్రికి లబ్ధిదారులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.