నారావారి పల్లె (చైతన్య రథం): అనారోగ్య పరిస్థితులతో ఆర్థికంగా సతమతమవుతున్న నలుగురికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందించి తానున్నానని భరోసా కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తమకు దిక్కెవరని తల్లడిల్లుతున్న ఆర్తులను ఆర్థికంగా ఆదుకుని మరోసారి మానవత్వం చాటుకున్నారు. గురువారం రాత్రి నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటివద్ద తనను కలిసి సమస్యను చెప్పుకున్న బడుగు వర్గాలకు చంద్రబాబు భరోసా కల్పించారు. ఆర్థిక సమస్యలతో ఆరోగ్య చికిత్సకు ఇబ్బంది పడుతున్న నలుగురికి సీఎం సహాయ నిధి నుంచి చెక్కులను పంపిణీ చేశారు. వాయల్పాడు మండలానికి చెందిన జె కుసుమ కుమారి తన పదమూడేళ్ల కుమార్తె మానస అనారోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంకుల ఆస్పత్రిలో ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స తీసుకుంటున్న వీడియోను ముఖ్యమంత్రికి పంపించి.. తన ఆర్థిక పరిస్థితిని విన్నవించుకున్నారు.
బిడ్డకోసం తల్లడిల్లుతున్న కుసుమకుమారి ఇబ్బందికి చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. అలాగే, చంద్రగిరి మండలం శేషాపురానికి చెందిన పొదిలి శారద కుమారుడు 19ఏళ్ల హర్షవర్ధన్ బాబు కిడ్నీవ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో.. ఆర్థికంగా భరోసా కల్పిస్తూ రూ. మూడు లక్షల చెక్కును సీఎంఆర్‌ఎఫ్ కింద అందించారు. ఇక తిరుపతి గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తల్లి పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించటంతో.. సీపం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. చంద్రగిరి మండలం చిన్న రామాపురానికి చెందిన టి కృష్ణయ్య మెడమీద గడ్డలతో తన ఆరోగ్య, ఆర్థిక పరిస్థితి సరిగా లేదని చెప్పుకోవడంతో.. రూ.1.5లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద మనసుతో అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, చంద్రగిరి ఎంఎల్‌ఏ పులవర్తి నాని తదితరులు పాల్గొన్నారు.