అమరావతి(చైతన్యరథం): వరద బాధితులను ప్రమాద పరిస్థితులు నుంచి బయటపడేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సోమవారం పర్యటించిన మంత్రి పార్థసారథి సహాయక చర్యలను, బాధితులకు సాయం అందిస్తున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఎగువున క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం భారీగా పడి దిగువనున్న విజయవాడకు రావటంతో సింగ్‌నగర్ ప్రాంతం బుడమేరు వరద ముంపునకు గురైందన్నారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు కృషిచేస్తోందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం కాలువల మరమ్మత్తుల పనులను సకాలంలో చేయకపోవడం వల్ల నేడు ఈ ముంపు పరిస్థితులు ఏర్పడాయన్నారు. బుడమేరు, డ్రైన్లను నిర్లక్ష్యం చేయటం వల్ల కాలువలో గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయన్నారు. గత ఐదు సంవత్సరాల్లో బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన దానికి ఫలితమే నేటి ఈ వరద ముప్పు అన్నారు. ఎక్కడికక్కడ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలు డ్రోన్లు సహాయంతో టెక్నాలజీని ఉపయోగించి గుర్తించి సహాయం అందిస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంటోందన్నారు. హెలికాప్టర్ల సాయంతో బాధితులకు ఆహార పదార్థాలు తదితరాలు అందిస్తున్నామన్నారు. ఆహార పొట్లాలు, పాలు, మంచినీరు, బిస్కెట్లు వంటివి అందిస్తున్నామని మంత్రి పార్థసారథి చెప్పారు.