- ఆయన పనితీరు అందరికీ స్ఫూర్తినిస్తుంది
- కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్
అమరావతి(చైతన్యరథం): విపత్తుల సమయాల్లో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బాధితులకు సాయం అందించటమే కాకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు తానే స్వయంగా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడం, నేరుగా వరద బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. బాధితులు పస్తులు ఉండకుండా డ్రోన్లను ఉపయోగించి ఆహారాన్ని అందించటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా డ్రోన్ సహాయంతో వరద బాధితులకు ఆహారాన్ని అందించిన ఫొటోలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జనసేనాని ప్రశంసలు కురిపించారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే చంద్రబాబును తప్పకుండా అభినందించాలని ట్వీట్ చేశారు. డ్రోన్ల ద్వారా వరద బాధితుల బాధలను ఎలా తగ్గించవచ్చో ఈ ఫొటోలను చూస్తుంటే మనకు అర్థమవుతోంది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు వినూత్న మార్గాలను అన్వేషించే ముఖ్యమంత్రి చంద్రబాబును మనం తప్పకుండా అభినందించాలి. మీ నుంచి చాలా నేర్చుకోవాలి సర్. ఏపీలో మీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అందరికీ స్ఫూర్తినిస్తుందని పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా వరద బాధితుల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దాతృత్వాన్ని సీఎం చంద్రబాబు కొనియాడిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీకి 5 కోట్ల రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున భారీ మొత్తంలో విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. దీనిపైనా పవన్ స్పందించారు. మీ మాటలతో మరింత ఉత్తేజాన్ని కలిగించారు అంటూ సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అధికార సంక్షోభం, వ్యవస్థల నిర్వీర్యం, వనరుల దోపిడీ అనేవి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మరోవైపు ప్రకృతి వైపరీత్యం వచ్చి పడిరది. వీటి నడుమ మీ పాలనా దక్షత, విధి నిర్వహణలో మీరు (చంద్రబాబు) కష్టపడే విధానం స్ఫూర్తిదాయకం, అభినందనీయం. ఇటువంటి కష్ట సమయంలో మన ప్రజలను ఆదుకోవడం మన ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత స్థాయిలో నా కనీస బాధ్యతగా భావిస్తున్నాను. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖ యుద్ధప్రాతిదికన పాల్గొంటున్నాయి. త్వరలోనే మనం ఈ సంక్షోభం నుంచి బయటపడతామని ఆశిస్తున్నాను’’ అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన తాలూకు ఫొటోలను కూడా పవన్ పంచుకున్నారు