- భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్‌లో మార్పులు
- ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలు
- విద్య ప్రతి ఒక్కరి హక్కు
- బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదు
- ప్రతిభా అవార్డులు, పేరెంట్ టీచర్ మీటింగ్‌లు మళ్లీ ప్రారంభించాలి
- జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చేవారికి ప్రోత్సాహం
- విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి(చైతన్యరథం): విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పాఠశాల విద్యపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చుచేస్తోందని… క్షేత్రస్థాయిలో దీనికి తగ్గ ఫలితాలు కనిపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఇందుకోసం విద్యా రంగ నిపుణులు, మేధావులు, ఆయా రంగాల ప్రముఖలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వచ్చే 10 -20 ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి అందుకనుగుణంగా బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ప్రచార ఆర్భాటం కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు…బడి ఈడు పిల్లలు బయట ఉండడానికి వీల్లేదన్నారు.
ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడాలని… ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. విద్యార్థుల నమోదు 100 శాతం జరగాలని, గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ జరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీఏఏఆర్ (APAAR ` Automated permanent academic account registry) ద్వారా ప్రతి విద్యార్ధికి ఒక ఐడీ ఇవ్వాలన్నారు. ప్రైవేటు స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారని అధికారులు చెప్పగా… వారిని రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఉన్నాయని, వాటిని సద్వినయోగం చేసుకుని పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ రిపోర్ట్స్‌తో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని అన్నారు. జీవో నెంబర్ 117పై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ విషయంలో విద్యా రంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో పనిచేస్తున్న ఆయాలకు పెండిరగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ తో పాటు మాతృభాష తెలుగుకు కూడా తగు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తెచ్చి ప్రోత్సహించింది గత తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని… పెద్ద సంఖ్యలో డ్రాపౌట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తంచేస్తూ… డ్రాపౌట్స్ అడ్డుకట్టపై దృష్టిపెట్టి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సీఎం అన్నారు. త్వరలో జన్మభూమి 2.0 కార్యక్రమం ప్రారంభిస్తున్నామని….ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలన్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.
గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లిన వారు తమ పాఠశాల అభివృద్ధికి ఆసక్తి చూపుతారని… అలాంటి వారికి అవకాశం ఇవ్వాలన్నారు. మధ్యాహ్న భోజనం అమలులో లోపాలకు తావులేదని…. పిల్లలకు పెట్టే ఆహారంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి విడివిడిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అన్నారు. దీని కోసం ఐవిఆర్‌ఎస్ విధానాన్ని అవలంభించాలని అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ అందించే డైట్ కాలేజీల్లో ఉన్న పెండిరగ్ పోస్టులు భర్తీ చెయ్యాలని సీఎం ఆదేశించారు. టీచర్స్ కు కూడా నిరంతరం లీడర్ షిప్ ట్రైనింగ్ అందించాలని అన్నారు. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షల నిర్వహణ నిర్దేశిత ప్రమాణాలతో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు.
నూతన విధానాలు, సంస్కరణలు వివరించిన మంత్రి లోకేష్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు, సంస్కరణల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఒక క్లాసుకు ఒక టీచర్ అనే విధానం అమలుచేస్తున్నామని తెలిపారు. టీచర్లపై అనవసరపు ఒత్తిడి తేవడం వల్ల ఉపయోగం ఉండదని… అందుకే ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించామని వివరించారు. ఇదే సమయంలో విద్యార్థులకు బోధన, నాణ్యత, సేవల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడడం లేదని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, విద్యా రంగ నిపుణులతో మాట్లాడి విద్యా శాఖలో నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పేరెంట్ మీటింగ్‌లు భారీస్థాయిలో నిర్వహించాలని సీఎం అన్నారు. ఆ మీటింగులకు తనతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులంతా హాజరవుతారని తెలిపారు. పాఠశాలల్లో జరిగే అంతర్గత పరీక్షలపై ఏడాది చివర్లో థర్డ్ పార్టీ ద్వారా ఆడిట్ చేయాలని సూచించారు. మొత్తం విద్యా వ్యవస్థను, రోజువారీ వ్యవహారాలను మోనిటర్ చేయడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలని సీఎం సూచించారు.
అంతకు ముందు అధికారులు రాష్ట్ర విద్యాశాఖలో ప్రస్తుత పరిస్థితిని ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ స్కూళ్లు, 813 ఎయిడెడ్ స్కూళ్లుఉన్నాయని తెలిపారు. పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 5,520 ఉండగా, 20 మంది కంటే తక్కువ మంది ఉన్న స్కూళ్లు 8,072 ఉన్నాయని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని స్కూళ్లలో 70,22,060 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అందులో ప్రభుత్వ స్కూళ్లలో 35,13,533 మంది ఉండగా, ఎయిడెడ్ లో 92,579 మంది, ప్రైవేట్ స్కూళ్లలో 34,15,948 మంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో 1,87,996 మంది టీచర్లు పని చేస్తుండగా, ఎయిడెడ్ లో 3,396 మంది టీచర్లు ఉన్నారన్నారు. 2014-19 మధ్య విద్యావ్యవస్థలో ప్రధానమైన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏటా 4,026 ప్రతిభా అవార్డులు అందించామని, ఇందులో భాగంగా రూ.20 వేలు నగదు, మెడల్, ట్యాబ్ ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇదొక స్ఫూర్తిగా ఉంటుందని సీఎం చెప్పారు. డ్రాపౌట్స్‌కు కారణాలపై లోతైన విచారణ చేసి నివారణపై ఫోకస్ పెట్టి పనిచేయాలని సూచించారు.
నైపుణ్య గణన కార్యక్రమంపై సమీక్ష
అనంతరం స్కిల్ డెవల్మెంట్ పై సీఎం సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నైపుణ్య గణనపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ వర్గాల నైపుణ్యాలను లెక్కించి, అవసరమైన శిక్షణ ద్వారా వారికి మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలన్నది నైపుణ్య గణన లక్ష్యం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నైపుణ్య గణన చేపట్టబోతోంది. ఇందుకు రూపొందించిన విధివిధానాలపై సీఎంకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో 1.60 లక్షల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసు ఉన్న ప్రజలు ఉన్నారు, వారి నైపుణ్యాన్ని గణన చేయాల్సి ఉందని తెలిపారు. దీని కోసం 40 వేల మంది ఎన్యుమరేటర్లు అవసరం ఉంటుందని అన్నారు. స్కిల్ గణన కోసం మొత్తం 8 నెలల సమయం పడుతుందని… దీనిలో కేవలం సర్వేకి 55 నుంచి 70 రోజులు పడుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు.
బేసిక్ స్కిల్ ప్రొఫైల్, డొమైన్ స్కిల్స్, క్రాస్ ఫంక్షనల్ స్కిల్స్ పై గణన చేయాలని అన్నారు. డోర్ టు డోర్, మీ సేవ కేంద్రాలు, విద్యా సంస్థలు, మొబైల్ యాప్ వంటి 4 విధానాల ద్వారా స్కిల్ సెన్సస్ చేయవచ్చని ప్రతిపాదించారు. ఇప్పటికే ఉన్న నిపుణ అనే పోర్టల్ ద్వారా నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టవచ్చని అధికారులు వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. మరికొంత కసరత్తు తరువాత నైపుణ్య గణన కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టనుంది. ఈ రోజు సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు.