అమరావతి: ఒక అభాగ్యురాలికి పెన్షన్ పునరుద్ధరించి మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో సోమవారం పెన్షన్ల కోలాహలం నెలకొంది. సీఎం చంద్రబాబు సైతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకున్నవారిలో సీమా పర్వీన్ ఒకరు. ఆమెకు పెన్షన్ అందించడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. బంగారు తల్లి సీమా పర్వీన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడిరచారు. అంతేకాదు, పెన్షన్ అందించిన ఫొటోను కూడా ఎక్స్‌లో పంచుకున్నారు. చంద్రబాబు ఆమె గురించి ట్వీట్ చేయడానికి బలమైన కారణమే ఉంది. విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో విభిన్న ప్రతిభావంతురాలు సీమా పర్వీన్ పెన్షన్‌ను గత వైసీపీ ప్రభుత్వం తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్లూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన చంద్రబాబును సీమా తల్లితండ్రులు కలిసి సమస్య విన్నవించుకున్నారు. దీనిపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మండిపడ్డారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్ కు ఇచ్చే పెన్షన్ తొలగించడానికి మనసెలా వచ్చింది? 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రుల చేతుల్లోనే పెరుగుతున్న ఈ బిడ్డ పెన్షన్ తొలగిస్తారా? ఇంట్లో 300 యూనిట్ల విద్యుత్ వాడారని పెన్షన్ కట్ చేయడం ఏంటి అంటూ గతేడాది ఏప్రిల్ లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఆమె పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడామెకు తమ ప్రభుత్వం పెన్షన్ పునరుద్ధరించిందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు సంతోషంగా వెల్లడిరచారు.