- నిబంధనలు, పరిమితులు చూడొద్దని సీఎం ఆదేశించారు
- ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి లోకేష్
- గత ప్రభుత్వం కాలువలు, డ్రైన్లను గాలికి వదిలేసినందునే వరద ముంపు
అమరావతి(చైతన్యరథం): వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సాయం అందించటమే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. ముంపు బాధితులకు సహాయక చర్యలు పూర్తిస్థాయిలో సజావుగా సాగేందుకు వీలుగా నిధులు కొరత అనే మాట లేకుండా ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు నిబంధనలు, పరిమితులు చూడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యక్ష పర్యవేక్షణలో మొత్తం ప్రభుత్వ యంత్రాగం మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమయిందన్నారు. విజయవాడలో సహాయక చర్యల్లో పాల్గొంటున్న పయ్యావుల సోమవారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురియడంతో సింగ్ నగర్ ప్రాంతంలో బుడమేరు వరద ఉధృతి పెరిగిందన్నారు. 100, 200 ఏళ్ళ చరిత్ర చూసినా ఇంత భారీగా వర్షం కురిసిన దాఖలాలు లేవన్నారు.
2009 కంటే ఇప్పుడు కృష్ణాకు భారీగా వరద వచ్చింది. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఇంత పెద్దస్థాయిలో వరద వస్తుందని ఊహించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాలకు స్థానికంగా వర్షాలు తోడవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ముందుచూపు వల్ల ఆపదలో ఉన్న ప్రజలకు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేందుకు వీలయింది. అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం అందించడంలో మొత్తం అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సర్వసన్నద్ధం చేశారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముంపు ప్రభావిత బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్.. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయం అందించే చర్యలు సరైన విధంగా జరిగేలా చూస్తున్నారని మంత్రి పయ్యావుల చెప్పారు.
మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు
డివిజన్ల స్థాయిలో, వార్డు సచివాలయ స్థాయిలో మంత్రులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి వివిధ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. గత ప్రభుత్వం కాలువలు, డ్రైన్లకు సరైన మరమ్మతులు చేయకుండా గాలికి వదిలేయడంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి ఈ దుస్థితి ఎదురయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, బోట్లను రంగంలోకి దిగేలా చేశారు. ముందుగా ప్రజలకు అత్యవసరమైన ఆహార పదార్థాలను అందించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అహర్నిశలు కృషి చేస్తున్నాయి. స్థానికంగా ఆహార ప్యాకెట్లను సిద్ధం చేయడంతో పాటు పక్క జిల్లాలనుంచి కూడా ఆహారం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నాం.
సిద్ధం చేసిన ఆహార ప్యాకెట్లు, మంచినీరు, బిస్కెట్లు, తదితరాలను బాధితులకు చేరవేసేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశాము. బాధితులకు సహాయం అందించడంలో మీడియా కూడా భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం దృష్టికి మీడియా తీసుకువచ్చే అంశాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. బాధితులకు సహాయ, సహకారాలు అందించడం, మనోధైర్యం కల్పించడం అనేది అందరి సమష్టి బాధ్యత. ముఖ్యమంత్రి చొరవతో ఆయనతోపాటు మొత్తం అధికార యంత్రాంగం కలెక్టర్ కార్యాలయంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ సహాయక చర్యలు సాఫీగా సాగేలా చూస్తున్నామని మంత్రి పయ్యావుల తెలిపారు.