- అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి
- మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- అకాల వర్షాలు, వడగండ్ల వానతో వివిధ జిల్లాల్లో పంటనష్టంపై సమీక్ష
- 1,670 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని వివరించిన అధికారులు
- నష్టపోయిన రైతులు సాయం అందించాలని సీఎం సూచన
అమరావతి (చైతన్యరథం): అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతుల ఆత్మహత్యాయత్నంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల, వడగండ్ల వానతో పంట నష్టపోయి ఇద్దరు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు రైతుల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం తప్పిందని…అధికారులు వివరించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1,364 మంది రైతులకు చెందిన 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వానవల్ల జరిగిన పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని అధికారులు వివరించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా సాయం అధించాలని అధికారులకు సీఎం సూచించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని…రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.