అమరావతి (చైతన్య రథం): శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మంగళవారం ఘటనపై వేర్వేరుగా రెండుసార్లు జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్యంపై సీఎం ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఘటనలో మొత్తంగా 65మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని వివరించారు. ఎనిమిదిమంది ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారని… ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో మొత్తం 55మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రిలో 30మంది, జిజిహెచ్‌లో 11 మంది, జెమ్స్‌లో ఆర్గురు, యుపిహెచ్‌సిలో నలుగురు, మెడికవర్‌లో ఒకరు, ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముగ్గురు బాధితులు చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మిగిలిన 53మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. డయేరియా ప్రభావంపై నగరంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వే గురించి సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో భాగంగా డయేరియా లక్షణాలున్న మరో 79మందిని గుర్తించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనకరంగా లేదని… ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపినట్టు వివరించారు. వారికి అవసరమైన మందులు, ఓఆరఎస్ ప్యాకెట్లను ఇంటివద్దే అందజేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని, ముఖ్యంగా వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. వ్యాధి మరింత ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మురుగునీటి కాల్వల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని సీఎం అధికారులను ఆదేశించారు.





