అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 4న ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న అప్పుల నుంచి తేరుకొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన మద్దతును కోరడంతో పాటు రాష్ట్రానికి విరివిగా నిధులు అందించి అమరావతి, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం అయ్యాక తొలిసారి వెళ్తున్నందున ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు కొనసాగుతోంది. శాఖల వారీగా సమీక్షలు, వివిధ రంగాల నిపుణుల ద్వారా బడ్జెట్ కేటాయింపు అంశాలపై చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పోలవరానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులు పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో నివేదికను కొలిక్కి తెచ్చి సీఎం చంద్రబాబుకు, కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. దీంతో ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై కేంద్ర జలశక్తి అధికారులతోనూ చర్చించే అవకాశం కనబడుతోంది.
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వివిధ పెండిరగ్ ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండిరగ్లో ఉన్న ప్రాజెక్టుల వివరాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాజెక్టుల వివరాలు, గత ఐదేళ్లలో ఆయా ప్రాజెక్టులపై కేంద్రంతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రాజెక్టు ప్రతిపాదనలు, ఇప్పటివరకు జరిగిన చర్చల పురోగతి వివరాలు ఇవ్వాలని అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ సీఎస్‌లు, విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.