అమరావతి(చైతన్యరథం): ఈ నెల మొదట్లో విజయవాడలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సమయంలో పది రోజుల పాటు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి. ఎక్కడెక్కడినుంచో వచ్చిన సిబ్బంది, అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పదిరోజుల పాటు కలెక్టరేట్‌నే క్యాంపు ఆఫీసుగా చేసుకుని, పది రోజులపాటు బస్సులోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వరద సాయంలో భాగస్వాములైన వారితో సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడ కలెక్టరేట్లో సమావేశమై వారికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఇలాఉంటే విజయవాడ సహా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు ఇటీవల పరిహారం విడుదలైంది. ఆస్తి, పంట నష్టం కింద సుమారు 4 లక్షల మందికి రూ.602 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో రూ.569 కోట్ల సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. బ్యాంకు ఖాతాలు క్రియాశీలంగా లేని వారికి సోమవారం పరిహారం చెల్లించనున్నారు.