- ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
- పేలుడుపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
- కారకులపై చర్యలు తీసుకుంటామని ప్రకటన
- నేడు బాధితులను పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
- కలెక్టర్‌నుంచి ఫోన్‌లో వివరాలు తెలుసుకున్న వైనం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యానికి ఆదేశం
- ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్, విశాఖకు తరలించండి
అమరావతి (చైతన్య రథం): అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనలో 16మంది ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే సమాచారంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా కలెక్టర్‌తో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ఘటనలో 16మంది చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా అధికారులు సీఎంకి వివరించారు. క్షతగాత్రలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుదని, ఉన్నతాధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు అక్కడేఉండి పూర్తిస్థాయి సహాయక చర్యలు సమీక్షించాలని సీఎం అదేశించారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సహాయ చర్యల తీరును సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. తీవ్రంగా గాయపడిన 41మందికి మెరుగైన చికిత్స అందించాలని, తక్షణం క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ ద్వారా విశాఖ లేదా హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాలు కాపాడడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలన్నారు.
నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు
ఇదిలావుంటే, సీఎం చంద్రబాబు గురువారం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఫార్మాసెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. ఘటనా ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ప్రమాదం సంభవించిన సమయం నుంచీ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్న ముఖ్యమంతి.. సహాయక చర్యలపై జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. హెల్త్ సెక్రటరీతో మాట్లాడి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదంపై ఉన్నతస్ధాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ ఆధారంగా… ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
అండగా ఉంటాం: మంత్రి లోకేష్
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలుడులో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం చంద్రబాబు ఇప్పటికే యంత్రాంగాన్ని ఆదేశించారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు.
మంత్రి భరత్ దిగ్భ్రాంతి
ఫార్మా సెజ్ ప్రమాద ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్‌లో మాట్లాడి.. ఘటన నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని భరత్ కోరారు. పరిశ్రమల శాఖ అధికారులు అక్కడేఉండి సహాయక పర్యవేక్షించాని మంత్రి ఆదేశించారు.