- 2015 ఉత్తర్వుల మేరకు 8,352 చదరపు కిమీ పరిధిలో సీఆర్డీఏ
- ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ 36వ సమావేశం
- గతంలో జరిగిన భూ కేటాయింపులపై చర్చ
- కార్యాలయాల ఏర్పాటుకు మరో రెండేళ్లు గడువు
- ఐఆర్‌ఆర్ నిర్మాణం, నాలుగులైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్
అమరావతి (చైతన్యరథం): గత ప్రభుత్వం తగ్గించిన సీఆర్డీఏ పరిధిని మళ్లీ పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీఏ ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గతంలో భూమి పొందిన వాళ్లు ఎన్నిరోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి అనే అంశంపైనా చర్చించారు. సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు రెండేళ్లు పొడిగిస్తూ సమావేశంలో నిర్ణయించారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చేవారికే భూ కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు.
గతంలో జరిపిన భూ కేటాయింపులపై పున:సమీక్షించి ఆసక్తి చూపే సంస్థలకే అవకాశం ఇవ్వాలన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలి అనే అంశంపైనా సీఎం చర్చించారు. దేశంలో టాప్ 10 కాలేజ్ లు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపిన పలు గ్రామాలను మళ్లీ రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గత జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ఆర్ -5 జోన్ పైనా సమావేశంలో చర్చించారు.
గత ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై ముందుకెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్ల పొడిగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే కమిషనర్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.