- సెప్టెంబర్ చివరికి టీడీఆర్ బాండ్ల నిగ్గు తేలుస్తాం
- మంత్రి నారాయణ స్పష్టీకరణ
తిరుమల(చైతన్యరథం): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం మంత్రి నారాయణ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో నారాయణ మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు కలగాలంటే పరిశ్రమలు రావాలని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో సీఎం చంద్రబాబు ఉన్నారని తెలిపారు. రెండు నెలల్లోనే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు వివరించారు. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారు.
అనంతరం తిరుపతిలోని తుడా కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మౌర్య, తుడా వైస్ చైర్మన్ వెంకటనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని వెల్లడిరచారు. సెప్టెంబరు చివరినాటికి టీడీఆర్ బాండ్ల అక్రమాల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా 14 రోడ్లు నిర్మించేందుకు రూ.2,500 కోట్ల మేర మున్సిపల్ అధికారులు టీడీఆర్ బాండ్లు జారీ చేయగా, అందులో వైసీపీ నేతలు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం తెలిసిందే. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ టీడీఆర్ బాండ్ల జారీపై ఆరోపణలు ఉన్నాయి. కాగా టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని మంత్రి నారాయణ విమర్శించారు. ఇక, పురపాలక శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు.