- ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందన్న చంద్రబాబు
- ప్రతిఒక్కరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం
- క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా
- ఫార్మా కంపెనీ స్పందన సరిగా లేదన్న అధికారులు
- ప్లాంట్ నిర్వహణ, నిర్మాణాల్లో లోపాలపై సమాచారం
అమరావతి(చైతన్యరథం): అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాద ఘటనపై అనకాపల్లి జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవలను తెలుసుకున్నారు. అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు. ఇప్పటివరకు 17 మంది చనిపోయా రని వివరించిన అధికారులు…కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఏమిటనే విషయంలో ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు వివరిం చారు. ప్లాంట్ నిర్వహణలో మానవ తప్పిదం, ప్లాంట్ నిర్మాణంలో లోపాలపై ప్రాథమిక సమాచారాన్ని వివరించారు. ప్రమాదం అనంతరం ఫార్మా కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని తెలిపారు. వివరాలు తెలుసుకున్న చంద్రబాబు ముందు బాధితుల ప్రాణాలు కాపాడడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.