- కొత్త జిల్లాలో చంద్రబాబు తొలి పర్యటన
- వెలిగొండ ప్రాజెక్టు సందర్శన
- ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన
- ప్రజావేదిక సభనుంచి ప్రసంగం
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 12.40కు మార్కాపురం జిల్లాలోని గంటావానిపాలెం చేరుకుంటారు. 12.50కి ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, కెనాల్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి 02.10కి మార్కాపురం పట్టణం చేరుకుని.. 2.30కు తర్లుపాడు రోడ్డులో నిర్వహించే ప్రజావేదిక సభనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 05.20 గంటలకు అమరావతికి చేరుకుంటారు.
జిల్లా ఏర్పాటు తర్వాత మొదటి పర్యటన
మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల చిరకాల కల. ఎన్నికలముందు అక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ జనవరిలో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మార్కాపురం జిల్లా ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి పర్యటిస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం పూర్తికాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. కెనాల్స్, ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్, జంట సొరంగాలు పనులు కాకపోవడంతో పాటు పునరావాసం కల్పించకుండానే జగన్ జాతికి అంకితం చేశారు. అయితే ప్రాజెక్టును పూర్తిచేసి ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే రూ.456 కోట్లతో నిర్మించే ఫీడర్ కెనాల్ పనులకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.





