- తవ్వకాల నిలిపివేత
- నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
అమరావతి: విశాఖలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎం కార్యాలయం (సీఎంవో) స్పందించింది. విశాఖ జిల్లా అధికారులతో మాట్లాడి తవ్వకాలను నిలిపి వేయించింది. పర్యావరణానికి హాని కలిగించే ఇలాంటి చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎంఓ ఆదేశించింది.
గత వైసీపీ పాలనలో విశాఖలో తీవ్రస్థాయిలో పర్యావరణ విధ్వంసం జరిగింది. భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను ఆనుకుని తవ్వకాలు యథేచ్చగా జరిగాయి. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన, ప్రపంచ ప్రసిద్ధ ‘ఎర్రమట్టి దిబ్బలు’ ముప్పు ముంగిట ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తవ్వకాలు, నేల చదును, తదితర పనులు జరుగుతున్న ప్రదేశాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ), రెవెన్యూ అధికారులు బుధవారం పరిశీలించారు. పెద్దసంఖ్యలో జేసీబీలను ఏర్పాటు చేసి, పనులు చేపడుతుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల రాక తెలుసుకుని నిర్వాహకులు అంతకుముందే యంత్రాలు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు.
ప్రస్తుతం పనులు జరుగుతున్న భూములు భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గతంలో కేటాయించినవి. కొన్నిరోజులుగా ఆ భూముల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వి చదును చేస్తున్నారు. ఇటీవల ఈ పనులు మరింత వేగవంతం అయ్యాయి. సొసైటీ ఇళ్ల ప్లాట్లకు అనువుగా, లారీలు తిరిగేందుకు వీలుగా బయట నుంచి కొంత గ్రావెల్ తెచ్చి రోడ్లు వేస్తున్నారు. ఎంత వర్షం పడినా నీరంతా భూమిలోకి ఇంకేలా చేయడం ఇక్కడి ఎర్రమట్టి దిబ్బల ప్రత్యేకత. అలాంటి సున్నిత ప్రదేశానికి ఆనుకుని తాజాగా పనులు చేపట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేయటంతో ఉన్నతాధికారులు స్పందించి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు.