అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో నిర్వహించనున్న ‘సాగునీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ సాగునీటి సంఘాలు, రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. హంద్రీనీవా కాల్వ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. కాలువ విస్తరణ ద్వారా వివిధ ప్రాంతాలకు చేరుకున్న నీటి ప్రవాహాలు, సాగు ప్రాంతాలు, నీటి లభ్యత తదితర అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించనున్నారు. సమర్ధ నీటి నిర్వహణతో రాష్ట్రవ్యాప్తంగా సాధించిన నీటి భద్రత, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, భూగర్భ జలాలు తదితర అంశాలపై సీఎం మాట్లాడనున్నారు. ప్రత్యేకించి సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళికను ఇచ్చేలా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం వేములపాడు సమీపంలో పెండేకల్లు రిజర్వాయర్ ప్రాంతానికి వెళ్తారు. వర్షాధార ప్రాంతంగా ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో హాఫ్ మూన్ వ్యవసాయ కార్యాచరణను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన వివరాలు:
అనంతపురం తాడిపత్రి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి నుంచి 10.30 గంటలకు బయలుదేరి 12.10 గంటలకు యాడికి మండలం వేములపాడు చేరుకుంటారు. 12.30కు యాడికి మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.40 గంటలకు వేములపాడు గ్రామానికి చేరుకుని.. అక్కడ పెండేకల్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 3.40కు వేములపాడులో నియోజకరవ్గ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తాడిపత్రి నియోజకవర్గ పర్యటన ముగించుకుని రాత్రి 7.35 గంటలకు అమరావతి చేరుకుంటారు.
















