- తూనికలు, ధరల్లో తేడాలుంటే ఉపేక్షించేది లేదు
- తయారీదారులు, డీలర్లు కొత్త చట్టాలు తెలుసుకోవాలి
- పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
- ఎరువుల తయారీదారులు, డీలర్లతో సమావేశం
విజయవాడ(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతును ఆదుకునేందుకు అంకితభావంతో పనిచేస్తుందని, రైతుకు భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళుతుందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంగళవారం సాయం త్రం తూనికలు, కొలతల శాఖ ఆధ్వర్యంలో విజయవాడ పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎరువులు, పురుగుమందుల తయారీదారులు, డీలర్ల తో సమీక్ష నిర్వహించారు. యూరియా, డీఏపీ, ఎరువులు, పురుగుమందుల అమ్మకాల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. కొలతలు, ధరల్లో తేడాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. రైతు మోసపోకుండా చూసుకో వాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
బరువు, ఎమ్మార్పీల్లో తేడాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ జనవరి నుంచి అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం సేకరణ దగ్గర నుంచి కనీస మద్దతు ధర అందించే విధంగా ఈ ఖరీఫ్ సమయానికి సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తూనికలు, కొలతల శాఖ నిర్వహించిన తనిఖీల్లో యూరి యా, డీఏపీ ధరలు, కొలతల్లో తేడాలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు ఇబ్బంది కలుగుతున్న విషయం దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల దుకాణాల వద్ద ఎమ్మార్పీని రౌండ్ ఫిగర్ చేసి అమ్ముతున్నారు..ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర తీసుకోవడం అంటే మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతుందన్నారు.
కొలతల్లో తేడాలుంటే ఉపేక్షించేది లేదు
తూనికలు, కొలతల శాఖ నుంచి ఇటీవల క్షేత్ర స్థాయిలో చేపట్టిన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 252 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. రైతును ఇబ్బంది పెట్టే విధంగా కొలతల్లో తేడా లు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మరికొన్ని అధిక ధరల వసూళ్లకు సంబంధించిన కేసులు ఉన్నాయన్నారు. రవాణాలో బరువు తగ్గితే ఉన్న కొలత లెక్క కట్టి దాని మేరకే ధర చెల్లించే ఏర్పాటు చేయాలని, ఎక్కడా రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన యూనిట్ సేల్ ప్రైస్ నిబంధనను తయారీదారులు కచ్చితంగా అమలు చేయాలన్నారు. తయారీదారులు, డీలర్లకు కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్నారు. ఖరీఫ్ సమయానికి మీ నుంచి సహకారం అవసరమని, ఉద్దేశపూర్వకంగా ఎవరి మీదా కేసులు పెట్టమని, ప్రభుత్వపరంగా చట్టానికి లోబడి ముందుకు వెళతామని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ జాయింట్ కంట్రోలర్ బి.రామ్‌కుమార్ తూనికలు, కొలతల శాఖలో కొత్తగా వచ్చిన చట్టాలు, నిబంధనలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.