- కోట్లాది రూపాయిల సీఎంఆర్‌ఎఫ్ నిధులతో పేద ప్రాణాలకు అండ
- నియోజకవర్గ స్థాయిలో సాధికార సారథుల సేవలు భేష్
- 80 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత
అద్దంకి (చైతన్యరథం): ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇచ్చిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రజావేదిక నిర్వహించారు. ముందుగా 80 మంది లబ్ధిదారులకు రూ.39 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. వీటితో పాటు రూ.9 లక్షల విలువైన ఎల్వోసీలను ఇద్దరికి అందజేశారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… అనారోగ్య సమస్యల వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులవుతాయని, ఆస్పత్రుల ఖర్చులతో కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల ఆరోగ్య రక్షణకు చర్యలు చేపట్టామని వివరించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వందలాది మందికి ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోనే ఇప్పటి వరకు 439 మందికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా లబ్ధి చేకూరిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడిరచారు.
సాధికార సారథులతో పార్టీ మరింత బలోపేతం
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం దిశగా సాధికార సారథులు కృషి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో సాధికార సారథులు పార్టీ గెలుపుకు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరమో వారికి తెలుసని చెప్పారు. పథకాలు అందని వారికి, సీఎంఆర్‌ఎఫ్ అవసరమైన వారిని సాధికార సారథులే గుర్తించి వారికి లబ్ధి చేకూర్చాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 4,500 మంది సాధికార సారథులతో పార్టీ సభ్యులు కూడా సమన్వయం చేసుకుని గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు. నెలలో ఒక రోజు అందరూ కలిసి సమావేశం అయ్యి అన్ని విషయాలూ చర్చించాలని చెప్పారు. అదే విధంగా సాధికార సారథులను ఎవరూ తక్కువ చేయకూడదని, గత ఎన్నికల్లో వారంతా క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదని ధీమా వ్యక్తం చేశారు.