- పారిశ్రామిక కారిడార్‌లు, పోర్టులతో తీరప్రాంతంలో అభివృద్ధి వేగవంతం
- వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో తీరప్రాంతంలో ఒడిదుడుకులు
- పర్యావరణ ప్రభావిత అంశాలకు పరిష్కారం కనుగొనాలి
- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహించిన జాతీయ సదస్సులో మంత్రి నారాయణ
విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ధి, పర్యావరణ రక్షణ అంశంలో ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ది శాఖల మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్‌తో కలిసి విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. టెక్నో ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఫర్ ఎకో సెన్సిటివ్ కోస్టల్ సెటిల్‌మెంట్ ప్లానింగ్ (సాంకేతిక, సాంప్రదాయ జ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా తీరప్రాంత పర్యావరణ రక్షణ) అనే అంశంపై ఈ సదస్సు జరుగుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తొలిరోజు గురువారం ముఖ్య అతిథిóగా మంత్రి నారాయణ హాజరయ్యారు. తీరప్రాంతంలో నెలకొంటున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్ట్‌లు, ప్లానర్లతో పాటు విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్ధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ది, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఆయా సవాళ్లను అధిగమించేందుకు ఇలాంటి సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. 972 కిమీ మేర తీరప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. ఇలాంటి సదస్సులో చర్చించే అంశాలు ఏపీకి ఎంతో ఉపయోగకరం అన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల యుగంలో తీరప్రాంతంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని తీరప్రాంతంలో 13 జిల్లాలతో పాటు విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం వంటి అనేక ప్రధాన నగరాలున్నాయని చెప్పారు.
ఆయా నగరాల పరిధిలో విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం – కాకినాడ పెట్రోలియం అండ్ ప్రెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ఉన్నాయి. పోర్టుల ఇప్పటికే ఉన్న వాటితో పాటు కొత్త పోర్టుల నిర్మాణంతో తీరప్రాంతాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. తీరప్రాంతంలో నివసించే జనాభాలో చాలామంది చేపలు పట్టడం, వ్యవసాయంతో పాటు సాంప్రదాయ వృత్తుల ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఇదే సమయంలో వాతావరణంలో జరుగుతున్న మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, సముద్ర కోత కారణంగా చాలా మేర తీరప్రాంతం ప్రభావితం అవుతోందన్నారు. ఏపీలోని తీరప్రాంతంలో దాదాపు 38 శాతం మేర జనాభాపై దీని ప్రభావం గణనీయంగా కనిపిస్తుందన్నారు. పర్యావరణంలో ఏర్పడుతున్న మార్పులతో ప్రభావితం అయ్యే జనాభాలో ఎక్కువ మంది చేపలు పట్టడంతో పాటు సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన వారు ఉన్నారన్నారు.
అటువంటి వారి జీవనోపాధికి వాతావరణంలో మార్పు కారణంగా ముప్పు పొంచి ఉంది. భారతీయ సాంప్రదాయ జ్ఞానం, సాంకేతికత ఉపయోగించి ప్రకృతి వైపరీత్యాలు వంటి సవాళ్లను అధిగమించేలా సదస్సులో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. 2024 కేంద్ర బడ్జెట్‌లో కూడా ఇలాంటి సవాళ్లను అధిగమించడం కోసం ఏపీకి కేటాయింపులు చేయడం కూడా మంచి పరిణామం. ఇలాంటి సవాళ్లను అధిగమించటంపై కేవలం నిపుణులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే కాకుండా ఆర్కిటెక్ట్ విద్యార్థులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర అభివృద్దికి ఎంతో కీలకంగా ఉన్న తీరప్రాంతంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంపునకు కూడా దోహదపడుతుందని మంత్రి నారాయణ అన్నారు. సదస్సుకు హాజరైన వారందరికీ మంత్రి అభినందనలు తెలిపారు.