- వరద నష్టం అంచనాకు మొత్తం 1,700 బృందాలు
- నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్
- త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తి
- ప్రజలు, రైతులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది
- విపత్తులో సీఎం చంద్రబాబు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు
- బురదజల్లే విమర్శలు సరికాదు
- మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ
విజయవాడ(చైతన్యరథం): వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్న విధానాలు, వ్యవహరిస్తున్న తీరును ప్రశంసిస్తూ జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 9 రోజులుగా విజయవాడ చరిత్రలో ఎన్నడూ చూడని ఉపద్రవం ముంచుకొచ్చిందన్నారు. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటోందన్నారు. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో వయసు, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా బస్సులోనే ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవ, కృషి, పనితీరు భవిష్యత్ తరాలకు, తనలాంటి ప్రజాప్రతినిధులకు ఆదర్శమని కొనియాడారు. వరదల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార, పార్టీ యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షిస్తూ సమస్య పరిష్కారం దిశగా పాటుపడుతున్నారన్నారు.
ఒకవైపు గత వారం రోజులుగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిఉండగా, మరో వైపు అల్పపడీన ప్రభావంతో మళ్లీ వర్షాలు పడుతున్నాయన్న వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.
అందరికీ సాయం..ప్రభుత్వ ధ్యేయం
సహాయక కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సాయం అందడంలో ఏవైనా తప్పులు ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహారం వృథా అయినా ఫర్వాలేదు కానీ బాధిత ప్రజలందరికీ సాయం అందాలన్నదే తమ తాపత్రయం అన్నారు. రోజుకు 6 నుండి 8 లక్షల అల్పాహారం, మధ్యాహ్నా, రాత్రి భోజనం ప్యాకెట్లు బాధితులకు అందిస్తున్నామని వివరించారు. బోట్లు, వాహనాలు, యంత్రాంగం వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేశారు.
ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
వర్షాల నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలే అవకాశముండటంతో ప్రభుత్వం ముందే అప్రమత్తమై 4,5 వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతోందన్నారు. దాదాపు 100-120 ఫైర్ ఇంజిన్లు, పంపులతో ఎప్పటికప్పుడు రోడ్లు, బాధితుల గృహాల్లో బురద తొలగించి శుభ్రం చేస్తున్నామన్నారు. బురదను తొలగించే పనిలో ప్రభుత్వం ఉంటే కొందరు ప్రభుత్వంపై బురదజల్లేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందివ్వాలని, విషం కక్కే వార్తలతో నీలి పత్రికల్లో విష ప్రచారాలు చేయడం తగదన్నారు. ప్రజాప్రతినిధులతో మాట్లాడటానికి ఇబ్బంది ఉంటే చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులకు సమస్యలు చెప్పవచ్చని సూచించారు.
మట్టి తవ్వకాలపైనే గత ప్రభుత్వ దృష్టి
గత ప్రభుత్వానికి కాలువలో వెలికి తీసిన మట్టిని అమ్ముకోవడంలో ఉన్నంత శ్రద్ధ అదే కాలువల మరమ్మతులకు నిధులు కేటాయించడంలో లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం కాలువల్లో మట్టి తవ్వకుని అమ్ముకున్నారే తప్ప డ్రైనేజీ కాలువలకు మరమ్మతులు చేద్దామని, గండ్లు పూడుద్దామని ఆలోచించలేదన్నారు. కనీసం కబ్జాకు గురవుతున్నా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిరదని ఆరోపించారు.
ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతోందని త్వరితగతిన శానిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. శానిటేషన్ సిబ్బంది పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు. తాను కృష్ణలంక ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు సహాయక చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వంపై నమ్మకముందన్నారు.
పకడ్బందీగా నష్టం అంచనాలు
వరదలు, భారీ వర్షాల వల్ల నష్టపోయిన వివరాలను వెల్లడిస్తామన్నారు. వరద నష్టం అంచనా వేయటానికి మొత్తం 1700 ఎన్యూమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వార్డు అసిస్టెంట్, పోలీసుతో కూడిన బృందం ఎన్యూమరేషన్ ప్రక్రియలో పాల్గొంటుందన్నారు. ప్రతి సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధి పర్యవేక్షిస్తారన్నారు. ప్రాథమికంగా 2,50,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, నష్టం వాటిల్లిందని అంచనా వేశామన్నారు. నష్టం అంచనా నమోదుకు అధికారులు ప్రత్యేక యాప్ రూపొందించారని తెలిపారు. ఎన్యుమరేషన్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకుంటే తర్వాత అయినా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్యూమరేషన్‌లో తమ గృహం, పేరు రాకపోతే స్థానిక ప్రజాప్రతినిధిని కలవాలని సూచించారు. వివరాలు సేకరించి యాప్‌లో నష్టపోయిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యాన రైతాంగం తీవ్రంగా నష్టపోవడం బాధ కలిగించే అంశమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు. గన్నవరం, నూజివీడు, ముదినేపల్లి లాంటి ప్రాంతాల్లో పొలాలు, గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయని, సంబంధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బాధ్యతతో వ్యవహరించకుండా కొందరు బురద చల్లుతున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు
కృష్ణలంకలో మంత్రి పార్థసారథి పర్యటన
మంత్రి సార్థసారథి సోమవారం విజయవాడ, కృష్ణలంకలోని 21వార్డు ఆర్చ్ వీధి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ చర్యలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించాలనే కృత నిశ్చయంతో ఉందని.. ఈ రోజు నుంచి నష్ట అంచనాలను రూపొందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ నివేదిక ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇళ్లకు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు వాటిల్లిన నష్టాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేసి, సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మీరు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.