టిడిపి అధికారంలోకి వచ్చిన వచ్చిన వెంటనే రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా బుధవారం నంద్యాల 13వవార్డు ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా వార్డులో 2017లో రోడ్ల విస్తరణ జరిగింది. ఇళ్లు కోల్పోయిన వారిలో కొంత మందికే పరిహారం అందింది. మిగిలిన వారికి పరిహారం ఇప్పించాలి. పద్మావతి నగర్ లో డ్రైనేజీలు, కల్వర్టులు లేవు వాటిని నిర్మించాలి. శ్రీ వెంకటేశ్వర కాలేజీ దగ్గర సిమెంట్ రోడ్డు వేయాలి.
భరతమాత గుడి సందు దగ్గర డ్రైనేజీ, కల్వర్టులు నిర్మించాలి. టెక్కె మసీదు దగ్గర కరెంటు స్థంబాలు మార్చాలి. టెక్కె ఆంజనేయస్వామి పక్క సందులో కరెంటు స్థంబాలు అధ్వానంగా ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలి. నాగులకట్ట ఎదురుగా డ్రైనేజీకి రెండు పక్కల కాలువలు ఉన్నాయి. వాటిని కలపాలంటూ విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. మున్సిపాలిటీల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని దుస్థితి కల్పించాడు.
రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో కరెంటు బిల్లులు చెల్లించలేక పవర్ కట్ చేయడం జగన్ దివాలాకోరు పాలనకు నిదర్శనం. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సిసి రోడ్లు నిర్మిస్తాం. కొత్త ఎలక్ట్రికల్ పోల్స్, ఎల్ ఇడి లైట్లు ఏర్పాటుచేస్తాం అని హామీ ఇచ్చారు.