- ప్రమాదంపై వైసీపీ నేతల రాజకీయం
- తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు
- హుటాహుటీన వచ్చి బాధితులను ఓదార్చి, భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి
- మీడియాతో హోంమంత్రి అనిత
విశాఖపట్నం(చైతన్యరథం): పరవాడ సినర్జిన్ కంపెనీ బాధితులకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందజేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు పరిహారం అందచేశామన్నారు. అనకాపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన రెండు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలను, క్షతగాత్రులను కూటమి ప్రభుత్వం తక్షణం అదుకున్నదన్నారు. వైసీపీ నేతలు కార్మికుల కుటుంబాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం, భరోసా కల్పించారన్నారు.
రెండు ఘటనలపై హోం మంత్రిగా తాను ఇక్కడే ఉండి పర్యవేక్షించినట్లు అనిత వెల్లడిరచారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాద మృతులకు ఎలాగైతే పరిహారం చెల్లించారో.. అలాగే పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో మృతులకు కూడా పరిహారం చెల్లించాలని యాజమాన్యంతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ఈ క్రమంలో పరవాడ సినర్జిన్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం తెలిపారు.
రూ.1 కోటి పరిహారం అందజేత
అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థ, యూనిట్ -3 లో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు. ఈనె 23వ తేదీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నాటి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ విజయనగరం జిల్లాకు చెందిన ఉద్యోగి సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో కార్మికుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పరిహారం అందజేత, ప్రస్తుతం బాధితుడికి అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడి ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులలో ముగ్గురు కార్మికులు జార్ఖండ్ వాసులు కాగా, ఒకరు విజయనగరం జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. వీరిలో జార్ఖండ్‌కు చెందిన రోయ అంగీరియా(22), లాల్ సింగ్ (21) ఇప్పటికే మృతిచెందగా, మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడిరచారు. సోమవారం విజయనగరం జిల్లా వాసి కె. సూర్యనారాయణ (35) ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కలెక్టర్ ప్రకటించారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెక్కును అందించినట్టు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.