ఢిల్లీ: ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో గత ఐదేళ్లుగా పని అడిగిన కార్మికులు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంతమందికి ఉపాధి కల్పించారు? జిల్లాల వారీగా వివరాలు చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో ఏమైనా ఆలస్యం జరిగిందా? ఆలస్యం జరిగితే పరిహారం చెల్లించారా? చెల్లించకపోతే ఎందుకు చెల్లించలేదో కారణాలు తెలపాలంటూ కోరారు. ఈ ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి కమలేశ్ పాశ్వాన్ బదులిస్తూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కోరిన వారి సంఖ్య 4,48,49, 710 మంది ఉండగా, ఉపాధి పొందిన వారు 3,73,35,517 ఉన్నారని తెలిపారు.
పనులు చేసిన కార్మికులకు ఆలస్యంగా వేతనాల చెల్లింపునకు పరిహారంగా గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 81,03,406 లక్షలు చెల్లించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ పథకం కింద వంద శాతం ఫండ్ ట్రాన్స్‌ఫ ర్ ఆర్డర్లు మస్టర్ రోల్స్ ముగిసిన 15 రోజుల లోపు సిద్ధం చేయటం జరుగుతుందని తెలిపారు. ఇక కార్మికులకు బ్యాంక్/పోస్టాఫీస్ ఖాతాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ ప్రకారం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా చెల్లించటం జరుగుతుందని వివరించారు. వేతనాల చెల్లింపులో ఆలస్యం జరిగితే మస్టర్ రోల్ ముగిసి న 16వ రోజు తరువాత రోజుకు 0.05 శాతం రేటు ప్రకారం ఆలస్యానికి పరిహారం చెల్లించటం జరుగుతుందని సమాధానమిచ్చారు.