ఇటీవల వర్షాల సందర్భంగా ఏర్పడిన పిడుగు పాటు కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం ఇవ్వాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేసారు. అవనిగడ్డలో గురువారం ఆయన మాట్లాడుతూ పిడుగుపాటు వంటి వైపరీత్యాల కారణంగా ఓ కుటుంబం తన పెద్ద దిక్కును కోల్పోతే ఆ కుటుంబం ఒక్క సారిగా సంక్షోబంలో పడి పోతుందని వారి కుటుంబాలను ఆడుకోవటం ప్రభుత్వ విధి అని అన్నారు.
పిడుగు పాటు కారణంగా జిల్లాలో వందల ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధం అయ్యాయి అని తెలంగాణాలో అలాంటి రైతులను గుర్తించి వారికి పంట నష్ట పరిహారం ఇస్తోందని అక్కడి మాదిరిగా రాష్ట్రంలోనూ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బుద్ధప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తెలుగుదేశం నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే రాఘవ తదితరులు పాల్గొన్నారు.