- సర్కారీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం..
- ప్రజారోగ్యానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు. కలెక్టర్లతో జరిగిన సదస్సులో ఆయన వైద్య ఆరోగ్యశాఖ, ఆస్పత్రుల పనితీరుపై పలు కీలక సూచనలు చేశారు. ఓపెన్ మార్కెట్‌తో పోటీపడేందుకు ప్రయత్నించడంతోపాటు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలని ఆదేశించారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగిన వైద్యం అందాలని సీఎం ఆకాంక్షించారు. కార్పొరేట్ ఆస్పత్రులు లాభాలు ఆశించి మెరుగైన వైద్యం అందిస్తున్నప్పుడు మనం ఏ లాభాపేక్ష లేకపోయినా మెరుగైన వైద్యం ఎందుకు అందించలేకపోతున్నామని అధికారుల్ని ప్రశ్నించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని సూచించారు. ఇన్స్యూరెన్స్ కూడా అందరికీ క్రమబద్ధంగా పెట్టాలని, ప్రైవేట్ ఆస్పత్రులతో మనం ఎందుకు పోటీపడలేమని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వ ఆస్పత్రులు పోటీపడాలని, దీన్ని సవాల్‌గా తీసుకొని యంత్రాంగం పనిచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, వసతులు, విశాలమైన స్థలం అన్నీ ఉన్నాయి గనక ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు.