- కాకినాడ పోర్టు పరిస్థితిని వివరించిన వైనం
- చర్యలకు ఆదేశించాలంటూ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
అమరావతి (చైత్యన్య రథం): కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆదేశించాలని సీఎం చుద్రబాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. రాష్ట్రంలో గత పదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లేలా స్మగ్లింగ్ సాగిందని ఆయనకు వివరించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో సుమారు రెండు గంటలపాటు పవన్ భేటీ అయ్యారు. కాకినాడ కేంద్రంగా విదేశాలకు బియ్యం అక్రమ రవాణా అంశంపై ప్రధానంగా చర్చించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని అన్నారు. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టునుంచే రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్ మాఫియాకు కళ్లెంవేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులుచేసి రూ.కోట్లు కూడబెడుతున్నారని, రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతి జరిగిందన్నారు. సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా ఇద్దరు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతోపాటు ఢల్లీి పరిణామాలపైనా, నామినేటెడ్ పదవుల నాలుగో జాబితా విడుదలపైనా నేతలు చర్చించినట్టు సమాచారం.