ఢిల్లీ: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని, వృద్ధులకు రౖౖెల్ టికెట్ చార్జీలలో రాయితీని పెంచాలని, అలాగే శారీరక, మానసిక వికలాంగులకు రాయితీ అందించి సౌకర్యాలను పెంచడంతోపాటు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రాలను ఆనుమతించాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఈ అంశాలకు సంబంధించి అశ్విని వైష్ణవ్‌కు అప్పలనాయుడు వినతిపత్రం అందజేశారు. ఇక నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ రాయితీ పాసులను పున ప్రారంభించాలని అప్పలనాయుడు అభ్యర్థించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ జర్నలిస్టులకు రాయితీ పాసులను రద్దు చేసినప్పటి నుంచి ఎక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వార్తలు, కథనాలు, తదితర ప్రెస్ సంబంధిత పనుల కోసం సొంత ఖర్చులతో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైలులో ప్రయాణం చేసేటప్పుడు అదనపు మద్దతు అవసరమయ్యే కొన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరచవలసిన అవసరం ఉందని అప్పలనాయుడు ఆ లేఖ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శారీరక, మానసిక వికలాంగులకు రాయితీని అందించే సౌకర్యాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ సిటిజనులకు రైల్ టికెట్ చార్జీల్లో రాయితీని పెంచాలని కోరారు.