- రేవంత్‌రెడ్డి సమర్థ నాయకత్వం
- అధిష్టానం పూర్తి మద్దతు
- కలిసికట్టుగా పనిచేసిన అగ్రనాయకులు
- ప్రభావితం చేసిన హామీలు
- మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- కేసీఆర్‌ను దీటుగా ఎదుర్కొన్న ప్రచార వ్యూహాలు
తెలంగాణ : కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు.. అగ్రనాయకులు తరచుగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తారు.. మరీ ముఖ్యంగా ఎన్నికల తరుణంలో. ఇదంతా గతమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిరూపించింది. ఏడాది క్రితం జరిగిన మునుగోడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి డిపాజిట్ గల్లంతు.. ఇటువంటి పరిస్థితి నుంచి మెరుపువేగంతో బయటపడిన కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పార్టీ అగ్ర నాయకత్వం నుంచి కింది స్థాయి కార్యకర్త వరకూ తాడోపేడో తేల్చుకునేందుకు అధికార పక్షంతో యుద్ధమే చేశారు. రేవంత్ నాయకత్వంలో విజయం సాధించారు..
ప్రజల నాడి పట్టి..
తెలంగాణలో ప్రజల నాడిని తెలుసుకోవడంలో కాంగ్రెస్ విజయవంతమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీల అమలుపై ప్రజలు పెదవి విరుస్తున్న సమయంలో హస్తం పార్టీ సరికొత్త వాగ్దానాలతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ విషయంలో కర్ణాటకలో విజయవంతమైన ఫార్ములానే తెలంగాణలో పునరావృతం చేసింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఇచ్చిన ఆరు వాగ్దానాలను అమలు చేస్తామని ప్రజలను మెప్పించడంలో విజయం సాధించింది.
వీటిల్లో మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500కే వంట గ్యాస్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ముఖ్యమైనవి. రైతు భరోసా పెంపుతోపాటు.. కౌలు రైతులకూ రూ.12 వేలు ప్రకటించారు. గతంలో తమకు రైతు బంధు అందేది కాదని అసంతృప్తితో ఉన్న ఈ వర్గాలను కాంగ్రెస్ ఇచ్చిన హమీ ఆకట్టుకుంది. దీనికి తోడు ఏకకాలంలో రూ. 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని కీలక హామీ ఇచ్చింది.
ఇక చేయూత పింఛన్లు రూ.4,000కు పెంపు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షల వైద్యం, గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రూ.5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు వంటివి యువత నుంచి సాధారణ ప్రజల వరకూ పలువురిని ఆకట్టుకొన్నాయి.
తొలి ఏడాదే 2లక్షల ఉద్యోగాలు..
తెలంగాణ ఉద్యమానికి మూలం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇంతటి ప్రాముఖ్యమున్న నియామకాల అంశంలో కేసీఆర్ ప్రభుత్వం భారీగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. టీఎస్ పీఎస్సీ పరీక్షల్లో డజనుకుపైగా లీకులు చోటు చేసుకోవడంతో దాదాపు 30 లక్షల మందికిపైగా అభ్యర్థులు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థంగా భుజానికెత్తుకొంది. తాము అధికారంలోకి వచ్చాక ఏడాదిలో రెండు లక్షల పోస్టులు భర్తీ చేస్తామని.. గ్రూప్ 1,2,3.4 నియామక ప్రక్రియల వివరాలను తేదీలతో సహా ప్రకటించింది. ఈ అంశం యువతను బాగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ విజయానికి అత్యంత బలంగా పనిచేసిన కారణాల్లో ఇది ప్రధానంగా నిలిచింది.
సిట్టింగ్‌లపై వ్యతిరేకత..
అభ్యర్థుల ఎంపికలోనే సగం విజయం దాగి ఉంటుంది. ఈ విషయాన్ని భారాస మరిస్తే.. కాంగ్రెస్ మాత్రం తూ.చ. తప్పకుండా పాటించింది. తెలంగాణాలో పలువురు భారాస సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండని సర్వేలు ఘోషించాయి. కానీ, వీరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే.. అంతర్గత కుమ్ములాటలకు బీజం పడుతుందని పార్టీ అధినాయకత్వం భావించింది. ఈ వ్యతిరేకతను కేసీఆర్ చరిష్మా అధిగమిస్తుందనుకొంది. ఎన్నికల నోటిఫికేషనుకు ముందుగానే దాదాపు అందరు సిట్టింగ్‌లకు టికెట్లను ఖరారు చేశారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకొంది. అన్ని రకాల సర్వేలు పరిగణనలోకి తీసుకొని.. పలు దశల్లో అభ్యర్థుల పేర్లను వడగట్టి ఢల్లీిలో తుది జాబితాను ఖరారు చేయడం ఇప్పుడు ఫలితాన్నిచ్చింది. సొంత గూటికి వచ్చిన వారిని, భాజపా, భారాసల్లోని అసంతృప్తులైన తుమ్మల, పొంగులేటి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్, జూపల్లి కృష్ణారావు వంటి గెలుపు గుర్రాలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి టికెట్లు ఇచ్చింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సహజంగా అగ్ర నాయకుల మధ్య జరిగే రచ్చ ఈ సారి కనబడలేదు. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ విషయంలో సీనియర్ నాయకులను ఒకే మాటపై నడపగలిగారు.
కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారన్న భావనతో భారాసకు పదేళ్ల పాటు ప్రజలు పట్టం కట్టారు. పదేళ్ల పాలన తరువాత ప్రజలు మార్పు కోరుకోవటం సహజం. ప్రజానాడిని గమనించిన కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీలోని అంతర్గత విభేదాలను సద్దుమణిగేలా చేసింది. రేవంత్ రెడ్డి సహా ఎవరూ తామే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వివాదాలకు కారణం కాలేదు. పద్ధతి ప్రకారమే నాయకుడి ఎంపిక ఉంటుందని సీనియర్లతో కూడా చెప్పించగలిగారు. ఈ పరిణామం పార్టీ ఐకమత్యాన్ని బలంగా తెలియజేసింది. ఈ క్రమంలోనే భారాసకు బలమైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించారనే చెప్పాలి. ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయమని.. సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని పార్టీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆడిగి.. ఒప్పించగలిగారు.
కేసీఆర్‌కు దీటుగా రేవంత్..!
తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టే విషయంలో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా వ్యవహరించారు. టికెట్ల పంపిణీ విషయంలో వచ్చిన కొన్ని విమర్శలను చాకచక్యంగా తిప్పికొట్టారు. మరోవైపు రేవంత్‌కు పార్టీ అధిష్టానం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కామారెడ్డిలో తీవ్రమైన పోటీ ఉంటుందని తెలిసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడిస్తానని రేవంతే నేరుగా బరిలోకి దిగడం అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా పార్టీ అధినాయకత్వాన్ని సరైన దిశలో తీసుకెళ్లడంలో రేవంత్ సఫలమయ్యారు. ప్రచారంలో కూడా రేవంత్ సభలకు ప్రజలు పోటెత్తారు. రెండు చోట్ల నుండి పోటీ చేసినా తను ఒక్కడే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి 50కిపైగా సభలను నిర్వహించారు. ఓ రకంగా పార్టీకి ఏకైక స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ నిలిచారు.
ప్రభుత్వ వ్యతిరేకతను చీలనీయని కాంగ్రెస్..
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ చాలా జాగ్రత్త తీసుకొంది. దాదాపు 50కి పైగా పౌర సంఘాలను తెలంగాణ విద్యావంతుల వేదిక మీదకు కిందకు తీసుకొచ్చి, ప్రజల్లో గుర్తింపు ఉన్న కోదండరామ్ వంటి వారి చేత అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. కేసీఆర్ పట్ల మైనారిటీల్లో అనుమానాలు రేకెత్తించటంలో సఫలమయ్యారు. దీనికి తోడు సీపీఐ కాంగ్రెసుతో జత కట్టడం కొంతమేరకు ఉపయోగపడిరది.
దీటుగా ప్రచారం..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా తెలంగాణాలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్న విషయాన్ని పార్టీ అధినాయకత్వం గ్రహించింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌కొ పార్టీ కీలక నేతలైన సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గేలు బలమైన మద్దతుదార్లుగా నిలిచారు. వారే స్వయంగా రంగంలోకి దిగి పార్టీ తరఫున హోరాహోరీగా ప్రచారం చేశారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని రూఢీ చేసుకొన్న వెంటనే కాంగ్రెస్ ప్రచారంలో గేరు మార్చింది. భారాసకు దీటుగా ప్రత్యేకమైన పాటలను, ప్రచార గీతాలను తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో వీటిని విపరీతంగా ప్రచారం చేసింది. అధికార భారాసపై వీడియోలు, మీమ్స్, పోస్టర్లతో భారీ ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున దాదాపు 200 మంది సభ్యుల బృందం ట్విటర్లో 24 గంటలూ ప్రచారం నిర్వహించారు. కారు పోవాలి.. హస్తం రావాలి.. మార్పు కావాలి.. వంటి స్లోగన్లు, భారాసపై పేరడీ సాంగ్స్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ వ్యూహాలన్నీ ఫలించి తెలంగాణ ‘హస్త’గతమైంది.
లోక్‌సభ సభ్యుడైన 54 ఏళ్ల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలోనే పార్టీని అధికారం వైపు నడిపించి తనపై పార్టీ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.