- విశాఖ భూ దందా సూత్రధారి సీఎస్‌పై ఏసీబీ కేసు నమోదు చేయాలి
- ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా బెదిరింపులు
- కౌంటింగ్ సక్రమంగా జరగాలంటే సీఎస్‌ను వెంటనే పదవినుంచి తప్పించాలి
- భూ మాయపై విచారణకు గవర్నర్ ఆదేశించాలి
- టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య డిమాండ్
అమరావతి(చైతన్యరథం): దాదాపు రూ. 2 వేల కోట్లు విలువ చేసే పేదల భూములను పెద్దసారుగా చెప్పబడుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), ఆయన కుమారుడు, వారి బినామీలు కొట్టేసేందుకు యత్నిస్తున్నారని…దానిని ప్రశ్నించిన జనసేన నేత మూర్తియాదవ్‌ను బెదిరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. భూ దందా ఆరోపణలు ఎదుర్కొంటున్న జవహర్ రెడ్డి సీఎస్‌గా కొనసాగితే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. భూ దందాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్‌పై రాష్ట్ర గవర్నర్ వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. సీఎస్ పదవినుండి జవహర్ రెడ్డిని తక్షణం తప్పించాలని ఎలక్షన్ కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎస్ భూ దందాపై ఏసీబీ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ భూ దందాలో ప్రముఖంగా వినిపిస్తున్న ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. విశాఖ కలెక్టర్ మల్లికార్జున, విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిలకు ఇతను ఎలా తెలుసు. తెలిస్తే ఎలా తెలుసో, ఎవరు పరిచయం చేశారో చెప్పాలి. పెద్దసారా, ఆయన తనయుడా ఎవరు పరిచయం చేశారు. పేదల భూములను కొట్టేయడానికి త్రిలోక్‌ను పంపారా? పేదల భూములను అప్పనంగా అతి తక్కువ ధరకే ఎలా కాజేశారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను అక్రమంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? కార్తిక అప్పల పైడమ్మ అనే మహిళ భూమిని తక్కువ ధరకు కొట్టేసి రిజిస్ట్రేషన్ చేయించకున్న తీరే వీరి భూ దందాకు నిదర్శనమని వర్ల వివరించారు.
గవర్నర్ విచారణకు ఆదేశించాలి
అధికారులపై ఆరోపణలు వస్తే పాలనా యంత్రాంగం, ఏసీబీ చూస్తూ చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే విచారణ జరిపిస్తారు. విశాఖ బూ కుంభకోణంలో ఇప్పుడు వేళ్లన్నీ సీఎస్ వైపు చూపిస్తున్నాయి. గవర్నర్ వెంటనే సీఎస్‌పై విచారణకు ఆదేశించాలి.. సీఎస్ పదవినుండి జవహర్ రెడ్డి పక్కనపెట్టాలి. భూ దందాపై ఏసీబీ చీఫ్ వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలి. ఏసీబీలో నిజాయతీపరుడైన అధికారికి ఆ కేసును అప్పగించాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ అధికారంలో ఉంటే ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదు. కౌంటింగ్ ప్రక్రియకు సీఎస్‌ను దూరంగా ఉంచాలి. కౌంటింగ్‌కు సంబంధించిన ఏ ఒక్క ప్రకటన సీఎస్ చేయడానికి వీలు లేకుండా చూడాలి. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని సీఎస్‌ను పదవి నుండి తొలగించి ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడాలని వర్ల కోరారు.
సీబీఐ విచారణ జరిపించాలి
గతంలో అసైన్డ్ పట్టాలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీల భూముల దగ్గరకు వెళ్లి సీఎస్ చూసి వస్తారు. తరువాత త్రిలోక్ ముఠా గద్దలాగా అక్కడ వాలి పేదలను ప్రలోభపెట్టి, భయపెట్టి భూములను కొట్టేస్తున్నారు. రాష్ట్రపాలనా బాధ్యతలు చూసే అత్యున్నత అధికారి ఇలా చేయటం సబబేనా? ఇటీవల త్రిలోక్ ముఠా భూముల్లో కంచె వేయడానికి వెళితే రైతులు తిరగబడ్డారు. సీఎస్‌ను కూడా బూతులు తిట్టారని వార్తలు వస్తే ఎందుకు స్పందించడంలేదు. తప్పు చేయకుంటే ఎందుకు ఖండిరచడంలేదు? సీఎస్ పేరు చెప్పి భూకబ్జాల ముఠా పేట్రేగి పోతున్నారని వార్తలు వస్తుంటే జవహర్ రెడ్డి ఎందుకు నోరు మెదపరు? ఈ భూ దందాపై గవర్నర్ పూర్తి విచారణకు ఆదేశించాలి. సీబీఐతో గానీ, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గాని విచారణ చేపట్టి భూ దందాలో ఉన్న కుట్రదారులందరిని బయట పెట్టి కటకటాల్లోకి నెట్టాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.