.పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా కల్పించిన అధినేత
అమరావతి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం పులివెందుల నియోజకవర్గ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) ఆధ్వర్యంలో వేముల మండలం చింతల జూటూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నారెడ్డి సాంబశివరెడ్డి, పల్లె వెంకటరామిరెడ్డి, దాసారెడ్డి లక్మిరెడ్డి, సింగం చిన్నగంగిరెడ్డి, అన్నారెడ్డి రామకృష్ణారెడ్డి, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, అన్నారెడ్డి గంగిరెడ్డి, ఎద్దుల గంగిరెడ్డి, రాగి పిండి సుధాకర్‌రెడ్డి ఇక్కడకు వచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎన్నికల సమయంలో వారు టీడీపీకి పోలింగ్ ఏజంట్లుగా వ్యవహరించారు. వైఎస్సార్ ప్రలోభాలాకు లొంగకుండా వారు టీడీపీకి అండగా ఉన్నారు. ఆ కక్షతో వైఎస్ ప్రభుత్వంలో అన్యాయంగా వారిని రాజారెడ్డి హత్యకేసులో, గొల్లల గూడూరు జంట హత్యల కేసుల్లో ఇరికించారు. జీవిత ఖైదీలుగా వారు శిక్ష అనుభవించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు వారిని 2016 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున క్షమాభిక్షతో విడుదల చేయించారు. ఆ విషయాలను గుర్తుచేసుకుని వారు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అండగా ఉండి మీ ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని చంద్రబాబు నాయుడు వారికి భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడును కలిసినవారిలో టీడీపీ సింహాద్రిపురం మండల క్లస్టర్ ఇన్‌చార్జి మారెడ్డి జయభరత్‌రెడ్డి, కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు తూగుట్ల రాఘవరెడ్డి, సీనియర్ నాయకులు అజ్జగుట్టు రఘునాథ్ రెడ్డి, తెలుగు యువత కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి, కాంబల్లి గంగాధర్ రెడ్డి, తూగుట్ల మునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.