- 81 పునరావాస శిబిరాల ఏర్పాటు
- వేలాదిమంది తరలింపు
- హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు అందజేత
- ఆహారం, నీరు పంపిణీకి డ్రోన్ల వినియోగం
- విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు
అమరావతి(చైతన్యరథం): విజయవాడలో కొనసాగుతున్న వరద సహాయక చర్యలను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం. 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు నిరాశ్రయుల తరలింపు చర్యలు చేపడుతున్నారు. సోమవారం ఉదయం వరకు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుండి 15 వేల మందికి పైగా నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు నగరంలోని ప్రధాన కళ్యాణ మండపాలు, హోటళ్లలో ఆశ్రయం ఏర్పాటు చేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 81 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. భారీ వరద కారణంగా నిలిచిపోయిన సెల్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయ చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రి లోకేష్ సమీక్షిస్తున్నారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
రంగంలోకి నేవీ హెలికాప్టర్లు
వరద సహాయ చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. సోమవారం మధ్యాహ్నం వరకు నేవీ నుండి మూడు హెలికాప్టర్లు వచ్చాయి. హకీంపేట ఎయిర్ బేస్ నుండి మరో నాలుగు హెలికాప్టర్లు వచ్చాయి. వరద ముంపు ప్రాంతాల్లో ఆరు హెలికాప్టర్ల ద్వారా పులిహోర, బిస్కట్లు, మందులు, వాటర్ బాటిళ్లు, సాఫ్ట్ డ్రిరక్స్‌లను ఎన్‌డిఆర్ ఎఫ్ బృందాలు జారవిడుస్తున్నాయి. 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. విజయవాడ నగరంలో నీటమునిగిన రవినగర్, వాంబేకాలనీ, జక్కంపూడి ప్రాంతాల్లో ఎంఐ-17 హెలీకాప్టర్ ద్వారా 3వేల కిలోలు, ఎఎల్-హెచ్ ద్వారా 2వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు జారవిడిచారు.ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించారు. ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం 11,41,276 క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా కృష్ణలంక పరిసరాలు నీటమునిగాయి. అక్కడ ఉన్న శ్మశానం ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టకుండా గత ప్రభుత్వం వదిలివేయటంతో ఆ ప్రాంతాలను నీరు ముంచెత్తింది. దీంతో బ్యారేజీ దిగువున ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని మంత్రి లోకేష్ నిరంతరం సమీక్షిస్తున్నారు.
డ్రోన్ల ద్వారా ఆహారం
వరదముంపునకు గురైన సింగ్ నగర్, జక్కంపూడి, కండ్రిగ, డాబా కొట్ల సెంటర్, లూనా సెంటర్ ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల పై అంతస్తుల్లో నివసిస్తున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070 లకు వస్తున్న విన్నపాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా మంత్రి లోకేష్ ఏర్పాట్లు చేశారు. ఐవిఆర్‌ఎస్ ద్వారా వరదబాధిత ప్రాంతాల ప్రజలనుంచి సహాయచర్యలను వాకబు చేస్తున్నారు.
విభాగాల వారీగా అధికారులకు బాధ్యతలు
వరద సహాయ చర్యలపై విభాగాల వారీగా అధికారులకు మంత్రి నారా లోకేష్ బాధ్యతలు అప్పగించారు. అధికారులకు అప్పగించిన బాధ్యతను ఏమేరకు పూర్తి చేశారన్న విషయమై లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాలనుంచి ఆహారాన్ని రప్పించి బాధితులకు చేరవేసే బాధ్యతను సీనియర్ ఐఎఎస్ అధికారి జి.వీరపాండ్యన్‌కు అప్పగించారు.
పొరుగు జిల్లాలనుంచి ఆహార పొట్లాలు
కాగా పొరుగు జిల్లాలైన బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను పంపించాలని టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో 3.9లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారు. వరదముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా మెడికల్ టీమ్‌లు ఏర్పాటుచేయాలని వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబును ముఖ్యమంత్రి ఆదేశించారు.