- చిత్తూరు జిల్లాలో రౌడీ రాజ్యం నడుపుతున్న వైకాపా మంత్రి
- వికసిత ఆంధ్ర కోసమే డబుల్ ఇంజిన్ సర్కార్
- రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం
- సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తాం
- దక్షిణాదిలోనూ బుల్లెట్ ట్రైన్ నడుపుతాం
- కలికిరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
పీలేరు(కలికిరి), చైతన్యరథం: ‘‘నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైకాపా మోసం చేసింది. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదు. పేదల వికాసం కోసం కాదు… మాఫియా వికాసం కోసం వైకాపా పనిచేసింది. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా మంత్రి ఐదేళ్లుగా గూండాగిరి చేస్తూ రౌడీ రాజ్యం నడుపుతున్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకు పక్కా ట్రీట్‌మెంట్ ఇస్తాం’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధాని పునరుద్దాటించారు.
రాష్ట్రం కోసమే డబుల్ ఇంజన్ సర్కార్….
అనేక ఖనిజాలు, భవ్యమైన, దివ్యమైన దేవాలయాలు కలిగిన ప్రాంతం రాయలసీమ, ఈ ప్రాంతంలో చైతన్యవంతులైన యువత, కష్టపడి పని చేసే రైతాంగం ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము సహాయం చేసినా వైసీపీ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందేనన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. యువత ఉపాధి కోసం వలస వెళ్తున్నారన్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జలజీవన్ మిషన్‌కు వైకాపా ప్రభుత్వం సహకరించలేదన్నారు. ఐదేళ్లుగా రైతులు పలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఎన్డీయే ప్రభుత్వం వస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తవుతాయని, ఉపాధి కోసం వలస వెళ్లేవారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని మోదీ చెప్పారు.
దక్షిణాదిలోనూ బుల్లెట్ ట్రైన్….
దక్షిణాదిలోనూ బుల్లెట్ ట్రైన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, త్వరలోనే ఈ ప్రాంతంలోనూ బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. రాయలసీమ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. నంద్యాల`ఎర్రకుంట్ల మధ్య రైల్వే లైన్ పూర్తయిందన్నారు. కడప`బెంగళూర్ మధ్య కొత్త రైల్వే లైన్ మంజూరు చేశామన్నారు. కడప విమనాశ్రయం కొత్త టెర్మినల్ నిర్మాణంలో ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తామన్నారు. రాయలసీమ రైతుల జీవితాలను మార్చగలిగేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. ఈ ప్రాంతంలో టమెటా పంట ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇప్పటికే పులివెందుల్లో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
బలమైన ప్రభుత్వం ఉంటే..
దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే దేశం దృఢంగా ఉంటుందని, గత పదేళ్లలో కేంద్రంలో శక్తివంతమైన ఎన్డీయే ప్రభుత్వం ఉన్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరిగిందని చెప్పారు. గల్ఫ్‌కు వెళ్లే భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. ఖతార్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా రప్పించామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతోందని, భారత్… విభిన్న జాతుల సమూహం అని చెబుతోందని, తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు దేశ విచ్ఛిన్నానికి పూనుకుంటున్నారని, అధికారం కోసం ఆ పార్టీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఈ సభలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొనగా.. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.