- 2014-19నాటి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం అమలు
- కాలేజీ యాజమాన్యాల ఖాతాలకు నేరుగా జమ
- పిఠాపురం సీహెచ్‌సీ వంద పడకలకు విస్తరణ
- అమరావతికి ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి ఓకే
- కేబినెట్ నిర్ణయాలు ప్రకటించిన మంత్రి కొలుసు
అమరావతి (చైతన్య రథం): సీఆర్‌డీఏ సహజ పరిధి అయిన 8,352.69 చ.కి.లను పునరుద్ధరించేందుకు మంతిమండలి ఆమోదం తెలిపిందని సమాచార మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిరచారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ సహా పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించిందన్నారు. ఇటీవల రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారని, ఉద్దండరాయునిపాలెం వద్ద సీఆర్డీఏ భవనం పనులు ప్రారంభమైనట్టు మంత్రి పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఐదో ఈ-క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలను విస్తృతంగా చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడిరచారు.
కోర్సు పూర్తైన వెంటనే విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలనే లక్ష్యంతో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్) చెల్లింపు విధానాన్ని మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నూతన విధానం ద్వారా 2024-25 విద్యాసంవత్సరం నుండి ఎస్సీలు కాకుండా ఇతర విద్యార్థులందరికీ సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను (ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్) సంబంధిత కళాశాలల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అమలు చేసిన విధానానికి ప్రస్తుత ప్రభుత్వం స్వస్తి పలికిందని మంత్రి తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను.. విద్యార్థులకు సంబంధం లేకుండా యాజమాన్యాల అకౌంట్‌లలోకి జమచేయడం జరిగేది. గత ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల యాజమాన్యాలు నిర్దేశిత గడువుకు ఫీజుల్ని చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక పరీక్షలు కూడా రాయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నింటినీ గమనించిన ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీ యాజమాన్యాల అకౌంట్‌లలోకే జమ చేయాలని నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా రూ.38.32 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడంతో పాటు 66 నూతన పోస్టులను మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిద్వారా 5-6 లక్షల మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ (సవరణ) చట్టం, 2020లోని సెక్షన్ 3ని సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 1990లో 6 పైసలున్న ఎలక్ట్రిసిటీ డ్యూటీని 2020లో రూ.1.00 కు పెంచడం జరిగింది. అయితే ప్రైవేటు పెట్టుబడిదారులు ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుండి తప్పించుకునేందుకు కోర్టులకు వెళ్లడం జరిగింది. ఈక్రమంలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ బకాయిలను వసూలు చేసేందుకు ఈ ముసాయిదా బిల్లును రూపొందించండం జరిగిందని మంత్రి వివరించారు.
ఏపీఐఐసీ యొక్క రాష్ట్రస్థాయి కేటాయింపు కమిటీ సిఫారసుల ప్రకారం 311 పారిశ్రామిక భూమి కేటాయింపులకై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిద్వారా పరిశ్రమల యూనిట్లకు భూమిని కేటాయించే విధానాన్ని పునరుద్ధరించేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అవుటర్ రింగ్ రోడ్, అమరావతి సిటీ మరియు విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతికి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)ను 189 కిలోమీటర్ల పొడవున నిర్మించాలన్నది ప్రతిపాదన. ఎక్స్‌ప్రెస్ వేలు, ఎకనమిక్ కారిడార్లు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులను ఓఆర్‌ఆర్‌కు అనుసంధానించనుండడంతో రాజధానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సీఆర్డీఏ పరిధిలోకి సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, బాపట్ల జిల్లాలోని 62 గ్రామాలను తీసుకురావడం జరుగుతుంది. ఓఆర్‌ఆర్ పరిధిలోకి.. బెంగళూరు-విజయవాడ కారిడార్, విజయవాడ-నాగపూర్ కారిడార్, ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-30, ఎన్‌హెచ్-216హెచ్, ఎన్‌హెచ్-544, ఎన్‌హెచ్-541జీ వంటివి అనుసంధానమవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.