- విపత్తుల్లో ప్రజలను గాలికొదిలేసిన చరిత్ర జగన్‌ది
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ధ్వజం
- వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబు అలుపెరగకుండా శ్రమిస్తున్నారని ప్రశంస
విజయవాడ(చైతన్యరథం): విపత్తులు వచ్చిన సమయంలో ఎప్పుడూ కొంప దాటి బయటికి రాని చరిత్ర ఉన్న జగన్ రెడ్డి, వరద సహాయ చర్యల్లో స్వయంగా పాల్గొంటూ, నిర్వరామంగా శ్రమిస్తూ అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు పార్టీ కార్యకర్తలను అందులో మమేకం చేసిన సీఎం చంద్రబాబును విమర్శించడం అత్యంత హేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక రకంగా ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదన్నారు. బెజవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని విపత్తు సంభవించిందని, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉండి, జనం అగచాట్లు పడుతుంటే జగన్ రెడ్డి ఈ రకంగా ప్రవర్తించడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.
బెజవాడ నగరంలో దాదాపు మూడో వంతు బుడమేరు వరదలో మునిగిపోయిందని, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు అని మరోసారి రుజువు చేయడానికి ఈ సహాయ కార్యక్రమాలే నిదర్శనమన్నారు. చంద్రబాబు అనుభవజ్ఞుడైన పాలకుడే కాదు, గొప్ప మానవతా విలువలు ఉన్న, సామాన్యుడి కష్టం తెలిసిన నిరంతర ప్రజా చింతనాపరుడని ఈ విపత్తు సమయంలో ఆయన వ్యవహరించిన తీరు స్పష్టం చేసిందన్నారు. ఏడున్నర పదుల వయసులోనూ అలుపెరగకుండా నిరంతరం ప్రజల క్షేమం కోసం తపిస్తున్న యోధుడుగా చంద్రబాబును పల్లా అభివర్ణించారు. ప్రకృతి ప్రకోపాన్ని గుర్తించి దాని నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలనే ఏకైక లక్ష్యంతో దాదాపు 72 గంటలకు పైగా ఎక్కడా విశ్రాంతి కూడా తీసుకోకుండా ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తూ సహాయ చర్యలను వేగవంతం చేసిన తీరు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో మరే వ్యక్తి చేయనంతగా ఆయన క్షేత్రస్థాయిలో తిరిగిన తీరు, అధికార యంత్రాంగాన్ని చైతన్యపరిచిన విధానం, సహాయ పనుల్లో అలసత్వం ప్రదర్శించిన వారికి సుతిమెత్తగా మందలిస్తూ బాధితుల పట్ల మానవీయంగా ప్రవర్తించాలని చెప్పిన వైనం ఆదర్శనీయమని అన్నారు. వాస్తవం ఇలా ఉంటే జగన్ రెడ్డి అవివేకంతో చేస్తున్న కువిమర్శలు ప్రజలంతా ఛీ కొట్టేలా ఉంటున్నాయి. గత ఐదేళ్ల పాలనలో కేవలం దోచుకోవడానికి తప్ప ప్రకృతి వనరుల పరిరక్షణకు ఏనాడు చర్యలు చేపట్టలేదని జగన్ తీరును ఎండగట్టారు. ఐదేళ్ల కాలంలో జగన్ ఒక్కరోజు కూడా జల వనరుల శాఖను పూర్తిస్థాయిలో సమీక్షించిన పాపాన పోలేదన్నారు. విజయవాడ నగరానికి సంబంధించి బుడమేరు నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షించేందుకు సమీక్ష చేసిన దాఖలాలే లేవన్నారు. అసలు వాగుకి, ఏటికి, నదికి, తేడా తెలియని జగన్ రెడ్డి.. అవి ఎటు నుంచి ఎటు ప్రవహిస్తాయో కూడా తెలియనంత అజ్ఞానంతో
కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. ఏ నదికి ఎక్కడ ప్రవాహ అడ్డుకట్టలు, బ్యారేజీలు ఉంటాయి.. అవి ఎలా ఆపరేట్ అవుతాయి అన్నది కూడా తెలియని పరమ నీచ పాలకుడిగా జగన్‌ను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారని పల్లా అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసం ఆధారంగా ఏ సామాన్యుడైన ఇదే నిర్ణయానికి వస్తాడన్నారు. చేతనైతే ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో చేస్తున్న సహాయ చర్యల్లో జగన్, ఆయన పార్టీ సభ్యులు సాయపడాలని పల్లా హితవు పలికారు. పనిచేస్తున్న వారి కాళ్ళకు అడ్డం పడడం ఈ సమయంలో అంత మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. లేకపోతే బాధితులు.. జగన్‌ను, ఆయన పార్టీని ఎప్పటికీ క్షమించబోరన్నారు. తీవ్రమైన యావగింపుతో ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.