- ముఖ్యమంత్రి చంద్రన్న కోసం పోటెత్తిన జనం
- ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని కమ్మేసిన అభిమానం
- జన ప్రవాహాలైన జాతీయ రహదారులు
- కొన్ని గంటలపాటు విజయవాడ అష్టదిగ్బంధనం
- పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని ఆపలేకపోయిన పోలీసులు
- పలు ఆంక్షలతో ఎక్కడికక్కడ స్థంభించిన ట్రాఫిక్
- ‘జై చంద్రన్న’ నినాదాలతో ప్రతిధ్వనించిన పరిసరాలు
అమరావతి (చైతన్య రథం): విభజిత రాష్ట్రాన్ని వికాసంవైపు నడిపించే దార్శనికుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు నలుదిక్కులూ కేసరపల్లిపై దండెత్తాయి. సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయం సాధించిన కూటమిని నడిపించే నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబు `బుధవారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరానికి సమీపంలోని కేసరపల్లిలో సాగే అద్భుత ఘట్టాన్ని కళ్లారా తిలకించేందుకు బుధవారం వేకువనుంచే నలుదిక్కుల ప్రజలు కేసరపల్లికి దారులుతీశారు. రాష్ట్రంలోని సుదూర జిల్లాల నుంచీ, వివిధ ప్రాంతాల నుంచీ బయలుదేరిన పార్టీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు ఒక్కసారిగా కేసరపల్లికి అటూ ఇటూ చేరుకోవడంతో `ప్రధాన రహదారులు జనమయమయ్యాయి. అదే సమయంలో `చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానితులుగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, గడ్కరీ, వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు, దేశ విదేశాల వ్యాపార దిగ్గజాలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవ్వడంతో.. వారి భద్రత దృష్ట్యా పోలీసులు బందోబస్తును పటిష్టం చేశారు. అనూహ్యంగా కేసరపల్లికి పోటెత్తిన అభిమాన జనాన్ని.. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి దూరంలోనే ఆపడానికి ఆంక్షలు విధించారు. దాంతో బెజవాడ లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేకపోవడంతో జన ప్రవాహం నిలిచిపోయి రోడ్లు స్థంభించాయి. కేసరపల్లికి చేరుకునే అంతర్గత రోడ్లు అభిమానుల వాహనాలతో కిక్కిరిసిపోవడంతో.. దాని ప్రభావం కేసరపల్లి నలుదిక్కులపైపడి ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆంక్షలతో విజయవాడలోకి వాహనాలు రాకుండా కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ జామైంది. విజయవాడ- గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కార్యకర్తలు, అభిమానులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. టోల్ రుసుం కోసం వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో సుమారు కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో పమాణ స్వీకారానికి వెళ్లేందుకు కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. వారధిపై చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపునుంచి వచ్చిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విజయవాడలోని రామవరప్పాడు రింగ్‌పై, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే చోటు చేసుకోవడంతో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని చూడ్డానికి వచ్చిన వేలాది అభిమానులు కేసరపల్లికి చేరుకోలేకపోయారు.
ప్రాంగణం వద్ద..
చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్దా పోలీసులు పెద్దఎత్తున ఆంక్షలు విధించడంతో.. వీవీఐపీలు సైతం లోపలికి చేరుకోవడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. అంతర్గత రహదారుల నుంచి ప్రధాన రహదారికివచ్చే దారులన్నీ పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో.. సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా పోటెత్తిన తెలుగుదేశం శ్రేణులు ఇబ్బందులు పడ్డారు. పాస్‌లు లేనివాళ్లను పోలీసులు వెనక్కి పంపిస్తే.. పాసులు చూపించిన వారినుంచి వాటిని తీసుకుని చించేసి లోపలికి పంపారు. దీంతో, ప్రాంగణంలోకి ప్రవేశించిన వారు లోపల ఎక్కడ కూర్చోవాలో అర్ధంకాని పరిస్థితులు ఎదురయ్యాయి.
భారీ భద్రతా చర్యలు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు తరలి రావడంతో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. దాదాపు పదివేలమంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఒక్క విజయవాడలోనే 3 వేల మంది పోలీసులు భద్రతా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇక గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మందికి రక్షణ విధులు అప్పగించారు. డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంకు వరకూ మొత్తంగా 60మంది ఐపీఎస్‌లు భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. వీవీఐపీల వాహనశ్రేణి నేరుగా వేదికకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లూ నిర్మించారు.
ఎక్కడికక్కడ భారీ స్క్రీన్లు..
ప్రమాణ స్వీకార ప్రాంగణంలో 36 గ్యాలరీల్లో భారీ స్క్రీన్స్‌పై ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆహూతులు తిలకించారు. కార్యక్రమం అందరికీ కనిపించేలా 36 గ్యాలరీల్లోనూ ఎస్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అలాగే, విజయవాడ పరిథిలో ఆనం కళాకేంద్రం, సుబ్రహ్మణ్య మైదానం, రామాలయం సెంటర్, పుష్కరఘాట్, హైటెక్ బస్టాండ్ తదితరచోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం తిలకించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 29 స్క్రీన్లు, రాజమహేంద్రవరంలో తొమ్మిదిచోట్ల అధికారులు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేమాదిరి రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోని బహిరంగ ప్రదేశాల్లో ఎస్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై అమరావతి రూపకర్త చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లా గడివేములలో, తిరుపతి పట్టణంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మహిళలు ఎల్డీ స్క్రీన్లలో తిలకించారు.