అమరావతి(చైతన్యరథం): ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కే వెంకటరామిరెడ్డి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి మరీ అధికార వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నందున అతనిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఆయనను సస్పెండ్ చేసి, క్రమశిక్షణా చర్యలు తీపుకోవాలంటూ బుధవారం సీఈఓకు అచ్చెన్నాయుడు ఒక లేఖ రాశారు. సచివాలయం ఉద్యోగులతో రాజకీయ సమావేశాలు నిర్వహించి వెంకటరామిరెడ్డి సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని ఆ లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఆయన రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఆయన వివిధ వర్గాల ఉద్యోగులతో సమావేశమై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఇతర రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నెల 2న అమలాపురం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సచివాలయం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డికి ప్రచారం చేసి మళ్లీ గెలుపొందేలా చూడాలని చెప్పారు. ఇది సర్వీసు నిబంధలను ఉల్లంఘించటమే. ఉద్యోగ సంఘ నాయకుడిగా.. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ రాజకీయ ప్రసంగాలు చేయడం, అధికార పార్టీ తరుపున ప్రచారం చేయడం తగదు.
వెంకటరామిరెడ్డిపై వెంటనే విచారణకు ఆదేశించచి, తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. విచారణ పెండిరగ్‌లో ఉంచి, అతన్ని సస్పెన్షన్‌లో ఉంచవచ్చునని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న మీడియాపై దుర్భాషలాడి, వైసీపీకి అనుకూలంగా అతను చేసిన వీడియో క్లిప్పింగ్‌లను లేఖకు జత చేసి పంపించారు.