- 1800 వందల అక్రమ బదిలీలను అడ్డుకున్నాం
- స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ అవినీతి
- అవినీతి అధికారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు
- డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు రాష్ట్రం నుండి పారిపోయే ఎత్తుగడ
- ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక ఫైళ్లను మాయం చేసే యత్నం
- ఈ ప్రయత్నాలను అడ్డుకున్నాం
అమరావతి(చైతన్యరథం): అవినీతి, పైరవీలతో కూడుకున్న టీచర్ల బదిలీలను అడ్డుకున్నామని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన, వైసీపీతో అంటకాగిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడుతూ కేంద్రం నుండి డిప్యూటేషన్‌పై వచ్చి.. వైసీపీ అవినీతి, అరాచకాలకు సహకరించిన కొంత మంది అధికారులు రాష్ట్రం నుండి పారిపోవాలని యత్నిస్తున్నారన్నారు. వారి ప్రయత్నాలకు గవర్నర్‌కు చెప్పి అడ్డుకట్ట వేయించాం. తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టేది లేదు. వారి అరాచకాలు, అవినీతి బయటపడతాయన్న భయంతో.. ఈ `ఆఫీసు, ఫైబర్ నెట్, ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక ఫైళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఉన్నచోట పోలీసులతో భద్రత కల్పించాలని గవర్నర్ ఆదేశించారని అశోక్‌బాబు చెప్పారు.
డబ్బు తీసుకుని బదిలీలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో 1800 మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. మే నెలలో రిలీవ్ అవ్వాలని ఆ ఉత్తర్వుల్లో చెప్పారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా అది కుదరలేదు. గురువారంతో ఎలక్షన్ కోడ్ ముగుస్తుంది. ఆ నేపథ్యంలో పాఠశాల విద్య కమిషనర్‌కు విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి 6తో కౌన్సిలింగ్ అయిపోతుందని, బదిలీ ఉత్తర్వులు అందుకున్న టీచర్లను 7న రిలీవ్ చేయాలని ఆదేశించారు. టీచర్లలో కొందరు ఐదు లక్షల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి, కౌన్సిలింగ్ లేకుండా వారికి కావాల్సిన ఊరికి ప్రభుత్వం నుండి నేరుగా బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అదే విధంగా 300 మంది స్టాఫ్‌నర్స్‌లకు పోస్టింగ్‌లు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో కూడా అవినీతి జరిగినట్లు తెలిసింది. టీచర్ల బదిలీ, నర్సుల పోస్ట్‌లను అడ్డుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు మా దృష్టికి తీసుకురావటంతో మా నాయకుడు చంద్రబాబుకు తెలియజేశాం. ఆయన అధికారులతో మాట్లాడటంతో వెంటనే ఈ బదిలీలను ఆపేసినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ఈ విధంగా వైసీపీ అవినీతికి, అరాచకానికి మొదటి అడ్డుకట్ట పడిరదని అశోక్‌బాబు అన్నారు.
అవినీతి అధికారులను వదిలేది లేదు
ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండీ, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ ఈఓ ఇలాంటి కొంత మంది డిప్యూటేషన్ పై వచ్చిన అవినీతి అధికారులు ఇక్కడ ఉంటే చర్యలు తప్పవనే భయంతో డిప్యూటేషన్ రద్దు చేసి, ఇక్కడ నుండి రిలీవ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. వీటిపై గవర్నర్‌కు నివేదిక ఇస్తే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేద వరకు ఎవరినీ రిలీవ్ చేయటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. దీంతో చీఫ్ సెకట్రరీ ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కాని ఆయనే సెలవు పెట్టుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతి తారస్థాయిలో జరిగాయి. దానిపై విచారణకు మా పాలనా కాలం ఐదేండ్లు సరిపోయేలా లేదు. డిప్యూటేషన్‌పై వచ్చి ప్రభుత్వ పెద్దల అరాచకాలకు సహకరించిన, డబ్బులు తీసుకుని టీచర్ల ట్రాన్స్‌ఫర్లకు సహకరించిన, స్టాఫ్ నర్సింగ్ నియామకాల్లో అవినీతికి పాల్పడిన అధికారులను వదిలేదు లేదు. టీడీపీ పాలనలో 30 మంది టీచర్లను బదిలీ చేస్తే ఉపాధ్యాయ సంఘాల నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పడు అక్రమంగా 1800 మంది టీచర్ల ట్రాన్ఫర్లు జరుగుతుంటే సంఘాలు మౌనం వహించటంలో ఆంతర్యం ఏమిటి? వ్యవస్థలను పాడుచేసిన అధికారులు కచ్చితంగా మ్యూల్యం చెల్లించుకుంటారు. కొంత మంది అధికారులు ఇప్పటికీ వైసీపీతో అంటకాగుతున్నారు. వీరెవరూ తప్పించుకోలేరు. మొదటిసారిగా అవినీతికి, అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. టీడీపీ పాలన అవినీతి, అరాచకాలకు అడ్డుకట్ట వేసేలా సాగుతుంది. ఇప్పటికైనా అధికారులు మారాలి. లేదంటే మీ రాతకు మీరే బాధ్యులు అవుతారని అశోక్‌బాబు హెచ్చరించారు.