- కాలేజీ విద్య రీ-ఓరియెంటేషన్
- ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం
- విద్యుత్ తీగలవల్ల ప్రమాదాలు జరగకూడదు
- ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు
- అవేర్ 2.0 మొబైల్ యాప్ లాంఛ్ చేసిన ముఖ్యమంత్రి
అమరావతి (చైతన్య రథం): ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు.. కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు.. సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం ఆర్టీజీస్‌నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలి.
టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది కొనసాగాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు… ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షలమంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలింది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాన్ని ఎంతవేగంగా చేపడుతున్నారో.. ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అదేస్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాం. రీచులవద్ద, స్టాక్ యార్డులవద్ద రవాణ పేరుతో కానీ… ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
కాలేజ్ కరిక్యులంను రీ-స్ట్రక్చర్ చేయాలి
“కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియేంటేషన్ చేయాల్సి ఉంది. ఈమేరకు అధ్యయనం చేయండి. యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలి. ట్రెడిషన్ కోర్సులతో పాటు… డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. ఈమేరకు కరికుల్యంను రీ-స్ట్రక్చర్ చేసేలా చూడాలి. అలాగే యూనివర్శిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి ఉంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీతోపాటు… మిగిలిన యూనివర్శిటీలు కూడా ర్యాంకింగులను మరింతగా పెంచుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలి. ఈమేరకు విద్యా శాఖ అధికారులు కృషి చేయాలి.
మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ… విమర్శలు కానీ రాకూడదు. శాప్ విభాగం తన యాక్టివిటీని మరింత పెంచుకోవాలి. 5కే రన్‌వంటి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజల్లో, యువతలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించేలా శాప్ చర్యలు చేపట్టేలా శాప్ చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు.. మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించాలి. కఠినంగా నిబంధనలు అమలు చేయడానికంటే ముందు… ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసమేననేది ప్రజలు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలి. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి ఇకపై జరగడానికి వీళ్లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పిడుగుపాటుపై మరింత అప్రమత్తత
‘పిడుగుపాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం. అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. టెక్నాలజీని వినియోగిస్తున్నాం. కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం…? ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు… క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలి. అలాగే ఫలానా టవర్ లోకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదముందని నెట్ వర్క్ ద్వారా ప్రజలకు తెలియచేసేలా చూడాలి’ అని సీఎం ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.













