- వారికి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్ వేయాలి
- ఐదున్నరేళ్లుగా కోడికత్తి శీను ఎందుకు జైల్లో మగ్గుతున్నాడు
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలి
- జగన్ ఇనుప పాదాల కింద నలుగుతున్న దళితజాతి
అమరావతి: ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్న దళిత ఖైదీలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ ను వేసి విచారణ జరిపించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ కోడికత్తి శీను.. ఎందుకు చిన్న కేసులో ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించాలన్నారు. దళితుడైనందునే కోడికత్తి శీను ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. జగన్ అతని విడుదలకు అంగీకరించడంలేదు. మామూలు పౌరుడికి ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఉంటే ఐదున్నరేళ్లుగా చిన్న కేసులో కోడికత్తి శీనును జైల్లో ఎందుకు ఉంచారు? బాబాయి తల నరికినోడు బయట ఉన్నాడు. కోడికత్తి గుచ్చినోడు మాత్రం ఐదున్నరేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు. ఇదెక్కడి న్యాయం? హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లు కోడికత్తి శీను కేసుపై స్పందించాలి. కోడికత్తి గుచ్చించుకొన్న వ్యక్తి లబ్ధిపొంది, శీనును మాత్రం జైలు పాలు చేయడంపై న్యాయశాస్త్రాలు ఏమీ చేయలేవా? వైసీపీలో ఉన్న దళిత నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు కోడికత్తి శీను బయటికి రాకుండా జగన్ తన శక్తి యుక్తులు ఉపయోగిస్తున్నాడు? కోడికత్తి శీను కేసు కోసం, కోడికత్తి శీను బయటికి రాకుండా ఉండటానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కోడికత్తి శీను జైలు నుంచి బయటకొస్తే తన గుట్టు రట్టు అవుతుందని జగన్ కు భయం. కోడికత్తి శీను కేసులో చంద్రబాబు అనుమతితో త్వరలో డిల్లీలోని సెంట్రల్ ఎస్సీ కమిషన్ ను కలుస్తామని వర్ల చెప్పారు.
రాష్ట్రంలో దళిత జాతి జైళ్లలో మగ్గుతోంది
రాష్ట్రంలో జైళ్లల్లో అనవసరంగా మగ్గుతున్న దళితుల స్థితిగతులపై ఆమ్మెస్టీ ఇంటర్నేషనల్ విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో దళితుల హాహాకారాలు వినిపిస్తున్నాయి. దళితుల ఘోష వినేవారే లేరా అని జైళ్లలోని 8,551 మంది దళిత ఖైదీలు గగ్గోలు పెడుతున్నారు. చివరకు దళితులు దగాపడ్డ తమ్ముళ్లుగా మిగిలారని ముఖ్యమంత్రి గమనించాలి. అమాయక దళితులు జగన్ ను నమ్మి, మాయలోపడి ఓట్లేసి ఎగిరెగిరి తన్నించుకునే పరిస్థితులొచ్చాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ కు చంద్రబాబు 5 పదవులిచ్చి గౌరవించారు.. జగన్ 50 పదవులిస్తారని వెళ్లి భంగపడ్డారు. జగన్ ను నమ్మినందుకు పదిమందిలో భోరున ఏడ్చారు. ఎండమావుల్ని నీరు అనుకొని టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్లినవారు అనుభవిస్తున్నారు. డొక్కా పరిస్థితి వారికి ఆదర్శం కావాలి. పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే బాబు కూడా భోరున ఏడ్చారు. తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి ముఖమే చూడలేదని బాబు అన్నాడు. తనకు ఈ సారి టికెట్ ఇవ్వడం లేదని భోరున ఏడ్చాడు. జగన్ హయాంలో దళితుల పరిస్థితి ఇలా వుంది. వారికి జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర దళితులందరూ ఒక గుణపాఠంగా తీసుకోవాలి. దళితులను తన ఇనుప పాదాలకింద వేసి పాతాళానికి తొక్కినట్టు జగన్ తొక్కడాన్ని దళితులు గమనించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. దళితులకు స్వాతంత్య్రం వచ్చినట్లుగా లేదు. రాష్ట్రంలో మాల, మాదిగలు ప్రభుత్వ ఇనుప పాదాల కింద నలుగుతున్నారు. పోలీసులు ఛార్జిషీట్లు వేయటం లేదు, రిమాండ్ కు పంపి చేతులు దులుపుకుంటున్నారు, కేసులు దర్యాప్తు చేయడం లేదు. అందుకే దళితులు జైళ్లలో మగ్గుతున్నారు. ఎస్ఐ కూడా సెల్యూట్ చేయని హోం మినిష్టర్ పదవిని దళిత మహిళకిచ్చి జగన్ అవమానపరిచారని వర్ల ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులకు దిక్కెవరు?
కేవలం ఛార్జిషీటు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 270 మంది ఉంటే 2022లో ఈ జగన్ ముఖ్యమంత్రిత్వంలో దళితుల 1470 మంది ఉన్నారు. జైళ్లల్లోని ఖైదీల వివరాలు పరిశీలిస్తే అగ్ర కులాల సంఖ్య తగ్గింది, దళితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రభుత్వానికి, పోలీసులకు, జగన్ కు పట్టనప్పుడు ఇక వారికి దిక్కెవరు? ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పుడు దర్జాగా ఉండేవాడు. ఇప్పుడు ఒక తాగుబోతుని తిప్పినట్లుగా చొక్కావిప్పి తిప్పించారు. జగన్ ఆదిమూలపు సురేష్ ను ఆట బొమ్మగా ఆడుకున్నాడు. నేను చంద్రబాబునాయుడుతో రోజూ మాట్లాడుతాను. ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉండి కూడా జగన్ తో మాట్లాడలేడు. చంద్రబాబు ఆలోచనల్లో నేను రోజూ పాలుపంచుకుంటాను, ఆదిమూలపు సురేష్.. నీవు జగన్ ఆలోచనలతో పాలుపంచుకోగలవా? మున్సిపల్ శాఖలో ఏం జరుగుతోందో, జగన్ ఏం చేయబోతున్నాడో సంబంధిత శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్‌కు తెలుసా అని వర్ల ప్రశ్నించారు.
దళితుల మేనమామనని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
దళితులకు మేనమామని అని చెప్పుకోవడానికి జగన్ కి సిగ్గుగా లేదా? ఇంకా దళితులు జగన్ గురించి ఆలోచించడం వృథాయే. ఇప్పటికైనా దళితులు సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరికీ ఏమీ తెలియని వ్యక్తులను కూడా ఎంపీలను చేయడం జగన్ కే చెల్లుతుంది. బాగా తెలివైనవాడిని ఎంపీగా చేస్తే అతను పార్లమెంటుకు వెళ్లి మాట్లాడుతాడు, అతని ద్వారా దళితులకు న్యాయం జరుగుతుంది. ఏమీ తెలియని వ్యక్తిని ఎంపీని చేయడంలో జగన్ గొప్పతనం ఇమిడివుందని వర్ల వ్యంగ్యం ప్రదర్శించారు. త్వరలో ఇవన్నీ మా పార్టీ అధినేత చంద్రబాబుకు సవివరంగా వివరిస్తాం. న్యాయమూర్తులను కలుస్తాం. సవివరంగా తెలుపుతాం, ఒక విచారణ కమిటీని వేయమని కోరుతాం. దళిత వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు.