మంగళగిరి : డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విదేశీ విద్య పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. దళిత యువత విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న సత్సంకల్పంతో చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని జగన్ రెడ్డి రద్దు చేయడం దళిత యువతకు ద్రోహం చేయడం కాదా? టీడీపీ ఆ పథకంపై పదేపదే ప్రశ్నిస్తోందని చివరకు తన పేరుతో తూతూమంత్రంగా ఆ పథకం అమలుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యాడు. అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పథకాలకు పెట్టుకోవడం జగన్ రెడ్డి దళిత వ్యతిరేకత కు నిదర్శనం కాదా? అంబేద్కర్ మహానీయుడి కంటే జగన్రెడ్డి గొప్పవాడా? 11 ఛార్జ్ షీట్లు తనపై వేయించుకొని, ప్రతి శుక్రవారం కోర్టుల్లో విచారణకు హాజరై, 16 నెలలు జైల్లో ఉన్న జగన్ రెడ్డి ఎక్కడ.. ప్రపంచమేధావి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఎక్కడ? దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక తన భస్మాసుర హస్తం దళితులపైనే పెట్టి,వారిని అథ:పాతాళానికి తొక్కేశాడు. దళితుల పథకాలకు అంబేద్కర్ పేరు తీసేసి, తన పేరు పెట్టుకున్నప్పుడే జగన్ రెడ్డికి దళితులపై ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని అర్థమైంది. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి చంపేసినప్పుడు…దళిత మహిళ నాగమ్మను పులివెందులలో దారుణంగా హత్యాచారం చేసినప్పుడు స్పందించని ముఖ్యమంత్రి దళితుల రక్షకుడా? వైసీపీ ఎమ్మెల్సీ తన వద్ద పనిచేసే దళిత డ్రైవర్ని కిరాతకంగా చంపేసి, శవాన్ని ఇంటివద్ద పడేస్తే చలించని ముఖ్యమంత్రి.. తన పార్టీ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోని ముఖ్యమంత్రి దళితుల రక్షకుడా? తన పాలనలో దళితులపై దాదాపు 280కు పైగా దాడులు చేయించి, దళితుల్ని తన ఇనుపపాదాల కింద నలిపేస్తున్న జగన్మో హన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అదే దళితులు రాజకీయంగా పూడ్చిపెట్టడం ఖాయం అని వర్ల రామయ్య హెచ్చరించారు.