- యువశక్తి, సమర్థ నాయకత్వంతో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు
- టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సీఎం చంద్రబాబు
- దావోస్లో ముఖ్యమంత్రితో చంద్రశేఖరన్ మర్యాదపూర్వక భేటీ
- ఏపీలో టాటా ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామని హామీ
- ముగిసిన సీఎం 4 రోజుల దావోస్ పర్యటన
- స్వదేశానికి తిరుగు ప్రయాణం
- నేడు హైదరాబాదు, అక్కడి నుంచి అమరావతికి
దావోస్ (చైతన్యరథం): ప్రపంచ పారిశ్రామిక రంగంలో వస్తోన్న మార్పులు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు దావోస్ వేదిక ఎంతో ఉపయోగకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్గా నిలిపేందుకు, కొత్త పాలసీలపై మార్కెట్ స్పందన అంచనా వేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. 2025 దావోస్ పర్యటనలో నిర్వహించిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో గ్రౌండ్ అయ్యాయని సీఎం వెల్లడించారు. దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి చంద్రశేఖరన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ…మూడు రోజుల పాటు నిర్వహించిన వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఏఐ, అగ్రికల్చర్, టూరిజం వంటి కీలక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలను వివరించారు. గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ కంపెనీలు మరింత ఆసక్తి చూపుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, అనుకూల విధానాల కారణంగా నేడు ప్రతి రంగంలో భారత్లో కంపెనీల స్థాపనకు విస్తృత అవకాశాలు పెరిగాయని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పంచుకున్నారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటం వాలీ, కర్నూలులో ప్రతిపాదించిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రతన్ టాటా: ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేకంగా టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖరన్ తెలిపారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపడుతున్న టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని టాటా గ్రూపును సీఎం కోరారు. రాష్ట్రంలో టాటా గ్రూప్నకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయగా, వాటన్నింటినీ సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకారం అందిస్తామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు.
4 రోజులు… 36కు పైగా సమావేశాలు
నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు స్వదేశానికి బయల్దేరారు. శుక్రవారం ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్కు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర సచివాలయానికి వెళతారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. 9కి పైగా సెషన్స్, సమావేశాలకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు దోహదం చేసిందని సీఎం అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో యూరప్ లోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. దావోస్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకూ ప్రత్యేక ఇంటర్వూలు ఇచ్చారు.















