- ఆయన అరెస్ట్‌పై హైకోర్టు ఇచ్చిన మినహాయింపులు రద్దు చేయండి
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితుడు శేషగిరిరావు
- తీవ్రనేరాల్లోనూ బెయిల్ ఇవ్వటంపై అభ్యంతరం
- కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయటఉంటే హింస ప్రజ్వరిల్లుతుందని ఆందోళన
న్యూఢిల్లీ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సిదిగా పోలీసులకు ఆదేశించాలంటూ బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఆయన అరెస్ట్‌పై హైకోర్టు ఇచ్చిన మినహాయింపు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో శనివారం నంబూరి పిటిషన్ దాఖలు చేశారు. మే 13వ తేదీన పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్‌బూత్‌లో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని, అనంతరం తనపై దాడి చేశారని బాధితుడు శేషగిరిరావు పేర్కొన్నారు. ఈవీఎం పగలకొట్టిన ఘటనలో ఈనెల 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ రోజు హింసకు పాల్పడిన ఎమ్మెల్యే.. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈవీఎం పగలకొట్టిన ఘటనపై మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంను పగలకొట్టిన ఘటనలో పక్కా సాక్ష్యాలు ఉన్నా, సీసీ కెమెరా రికార్డులు ఉన్నప్పటికీ స్థానిక వీఆర్‌వో.. ఎమ్మెల్యే పేరు, ఆయన అనుచరుల పేర్లు కూడా లేకుండా గుర్తు తెలియని వ్యక్తులంటూ కేసు పెట్టి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని తెలిపారు.
హత్యాయత్నం, ఈవీఎం పగలకొట్టిన ఘటనలు రెండూ తీవ్రమైన నేరాలయినప్పటికీ బెయిల్ మంజూరు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉన్నందున. భద్రత కల్పించాలని, రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరూ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, పిన్నెల్లి లేకపోయినా…ఆయన ఏజంట్ ద్వారా అయినా కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించే అవకాశం ఉందన్నారు. పిన్నెల్లి స్వయంగా కౌంటింగ్ దగ్గర ఉంటే మళ్ళీ హింస ప్రజ్వరిల్లే ప్రమాదం ఉందని శేషగిరిరావు పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో భయానక వాతావరణం నెలకొని ఉందని, పిన్నెల్లి బయట ఉంటే.. అది ఇంకా పెరిగే ప్రమాదం ఉందని బాధితుడు శేషగిరిరావు తెలిపారు. కౌంటింగ్ రోజు పిన్నెల్లి బయట ఉంటే మాచర్ల అంతా హింసాత్మక ఘటనలతో అట్టుడికే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత నెల 13న ఎన్నికల హింసకు పాల్పడిన ఆధారాలు స్పష్టంగా ఉన్నా… హైకోర్టు వాటిని పట్టించుకోకుండా… అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చిందని పిటిషనర్ మరొకసారి విజ్ఞప్తి చేశారు. కాగా బాధితుడు శేషగిరిరావు దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఈనెల 3న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.